జగన్ అధికారంలోకి రాగానే ఒక్కసారిగా 25 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని, పాలన మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే జగన్ ఒక్కసారిగా మంత్రివర్గం ఏర్పాటు చేయడంతో పలువురు సీనియర్లు షాక్ తిన్నారు. సాధారణంగా ఏ సీఎం కూడా ఒకేసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయరు. సమయం బట్టి మంత్రివర్గ విస్తరణ చేస్తుంటారు. కానీ జగన్ మాత్రం ఒకేసారి మంత్రివర్గం ఏర్పాటు చేశారు.

 

కాకపోతే అప్పుడు మంత్రి పదవి రానివారు నిరాశ చెందకుండా, రెండున్నర ఏళ్లలో పనితీరు బాగోని మంత్రిని పక్కనబెట్టేసి కొత్తవారికి అవకాశం కల్పిస్తానని చెప్పారు. దీంతో ఆశావహులు 2022 సంవత్సరం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు మండలి రద్దు కానున్న నేపథ్యంలో, ఎమ్మెల్సీ కోటాలో మంత్రులైన పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు ఎంపిక కావడంతో, రెండు మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. ఇక ఖాళీ కానున్న ఈ పదవులపై సీనియర్ ఎమ్మెల్యేలు కన్నేశారు.

 

మంత్రి పదవి దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అయితే ఈ రెండ్ బెర్త్‌లు భర్తీ చేసే నేపథ్యంలో జగన్...పిల్లి, మోపిదేవి సామాజికవర్గాల చెందిన వారికే అవకాశం కల్పించవచ్చని తెలుస్తోంది. దీంతో ఆయా సామాజికవర్గ ఎమ్మెల్యేలు వైసీపీ అధిష్టానం వద్ద అప్పుడే లాబీయింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే పిల్లి సుభాష్(గౌడ/శెట్టిబలిజ) వర్గానికి చెందిన కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా మంత్రి పదవి దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

అయితే ఇదే సామాజికవర్గానికి చెందిన పలమనేరు ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్‌ జూనియర్ కావడం జోగికి కలిసొస్తుంది. జోగి పెడన నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పైగా వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడు. అదేవిధంగా ప్రతిపక్ష టీడీపీపై దూకుడుగా విమర్శలు చేసే నేతల్లో జోగి కూడా ఒకరు. వీటికితోడు పిల్లి సుభాష్ సామాజికవర్గం కూడా కావడం జోగికి అడ్వాంటేజ్. ఒకవేళ జగన్ సామాజికవర్గం పరంగా ఆలోచిస్తే జోగికి మంత్రి పదవి రావడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: