తెలంగాణలో కరోనా కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లో మళ్లీ లాక్ డౌన్ పెట్టాలని ప్రభుత్వం ఆలోచనలో ఉందంటే సీన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం మరింత ఇరుకున పడే పరిస్థితి తీసుకొచ్చినందుకు ఓ ఐపీఎస్‌ ను తక్షణమే బదిలీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

 

 

తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వి. కె సింగ్ ను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. అందుకు ఆ అకాడమీలో 180 మందికి కరోనా వచ్చినట్టు ఆయన ప్రకటించడమే కారణంగా తెలుస్తోంది. సాధారణంగా కరోనా కేసులను ప్రభుత్వమే నిర్థారించాల్సి ఉంది. అలాంటి ప్రకటన ఏదైనా చేయాలంటే అది వైద్య ఆరోగ్య శాఖ మాత్రమే చేస్తుంటాయి.

 

 

కానీ... వీకే సింగ్ మాత్రం అందుకు భిన్నంగా తెలంగాణ పోలీస్ అకాడమీలో 180 మందికి కరోనా సోకిందంటూ మీడియాకు ప్రకటించడం ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించినట్టుంది. అకాడమీలో కరోనా పరీక్షలు జరపగా ఈ కేసులు నిర్దారణ అయినట్లు వీకేసింగ్ తెలిపారు. అయితే వీరికి కరోనా లక్షణాలు కనిపించలేదని ఆయన చెప్పారు.

 

 

ఆయన వైఖరిపై కోపంగా ఉన్న ప్రభుత్వం ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. ప్రస్తుతం పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ చైర్మన్‌గా ఉన్న వీవీ శ్రీనివాస్‌రావుకు తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

 

 

అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. వీకే సింగ్ ఇటీవలే ప్రభుత్వానికి స్వచ్ఛంద విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తనకు డీజీపీగా ప్రమోషన్ ఇవ్వలేదన్నది ఆయన అసంతృప్తి. బహుశా అందుకే చివరి రోజుల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ఉంటారన్న వాదన వినిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: