అవినీతి పరులకు అవకాశం చిక్కాలే కానీ దేన్నీ వదలరు.. అందులో కరోనా వచ్చి ఇలాంటి వారిని మరింతంగా ఉత్సాహపరుస్తుంది.. లోకంలో కష్టాలు మొదలైనప్పుడు అన్యాయాలు కూడా అదే స్దాయిలో జరుగుతాయని ఇప్పుడున్న పరిస్దితిని బట్టి చూస్తే అర్ధం అవుతుంది.. లేకపోతే చిన్న జీతాలకు పనిచేసే జీతగాళ్లు అక్షరాలా నాలుగు కోట్ల రూపాయలు ఎక్సైజ్‌ శాఖకు చెల్లించడం చూస్తే మతిపోవడం ఖాయం.. నిజమే ఆలోచిస్తే దీనివెనుక ఎంత పెద్ద స్కాం జరిగిందో అర్ధం అవుతుంది.. తెరమీద కనిపించేది చిరు ఉద్యోగులే కానీ దీనివెనక పెద్దతల హస్తం ఉందని అర్ధం అవుతుంది..

 

 

ఇకపోతే కరోనా మహమ్మారితో ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ జీవిస్తుంటే పలుకుబడి ఉన్న స్థానిక నేతలు లిక్కర్‌ దొంగతనాల పేరుతో అందినకాడికి జేబులు నింపుకొన్నారు. ఇందుకు గానూ మద్యం షాపుల్లో పనిచేసే సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్‌ను ఉపయోగించుకుని దొంగతనాల పేరుతో లిక్కర్‌ మాయం చేసి, అధిక ధరలకు బ్లాకులో అమ్ముకున్నారు.. కాగా ఎక్సైజ్‌ శాఖ పోయిన లిక్కర్‌కు షాపుల్లో పనిచేసే సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్‌ను బాధ్యులను చేసి వాటి ఖరీదు కట్టమని పేర్కొనగా వారు తాపీగా వచ్చి ఆ మొత్తానికి ధరచెల్లించి వెళ్లారు. ప్రభుత్వం కూడా పోయిన మద్యానికి నగదు వచ్చేసింది కనుక, దాన్ని సీరియస్ గా తీసుకోకుండా చేతులు దులుపుకొంది. అంతిమంగా అక్రమార్కులకు లాభం చేకూరింది.

 

 

అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే షాపుల వద్ద 24 గంటలూ వాచ్‌మెన్‌ కాపలా కాస్తున్నా, సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్‌ సైతం పగలు షాపుల వద్దే పడిగాపులు కాసినా మద్యం ఎలా చోరీ అయ్యిందో ఎవరికీ అంతుబట్టలేదు. కొన్ని చోట్ల వేసిన తాళాలు వేసినట్లే ఉన్నా చివరికి లెక్కల్లో తేడాలు వచ్చాయి. ఇలా మన రెండు రాష్ట్రాల్లో మద్యం దొంగతనాల తంతు భారీగా జరిగిందట. ఒకవేళ నిజంగా దొంగతనాలే జరిగి ఉంటే అంత మొత్తాన్ని సిబ్బంది ఎక్కడి నుండి తెచ్చి వెంటనే ఎలా కట్టగలిగారనే అనుమానం కలుగుతుంది..

 

 

ఇక చోరీ అయినట్టు చెబుతున్న నాలుగు కోట్ల రూపాయల మద్యాన్ని బయట కనీసం రూ.12 కోట్లకు అమ్మినట్లు అంచనా. అందులో అసలు తిరిగి కట్టినా, వీటిలో కొంత సిబ్బంది జేబులోకి వెళ్లినా రూ.8 కోట్లు నేతల జేబుల్లోకి వెళ్లాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇకపోతే లాక్‌డౌన్‌లో ఉపాధి లేక ప్రజలు అల్లాడుతుంటే, దీన్నొక అవకాశంగా మార్చుకున్న నాయకులు మాత్రం కష్టకాలంలోనూ కోట్లు వెనకేసుకున్నారనే వాదన వినిపిస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: