కరోనా విజృంభించడంతో అప్పట్లో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సమయంలో వలస కూలీల యాతన అంతా ఇంతా కాదు. చేసేందుకు పని లేక, ఉండేందుకు నీడ లేక, పిల్లాపాపలతో తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు వారు అష్టకష్టాలు పడ్డారు. రవాణా మార్గాలు అన్నీ, ఎక్కడికక్కడ స్తంభించడంతో, చేసేదిలేక వేల కిలోమీటర్లు నడక బాట పట్టి, తమ సొంత గ్రామాలకు చేరుకునేందుకు అప్పట్లో వలస కూలీల పడిన వేదన వర్ణనాతీతం. నడుస్తూ నడుస్తూ మధ్య మార్గం లోనే చాలా మంది మరణించిన సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు పెరిగిపోయాయి. అలాగే అంతర్జాతీయ మీడియాలో ఈ వార్తలు ప్రచారం అవ్వడంతో ఇతర దేశాల ముందు భారత్ పరువు మంట కలిసిన సంగతి తెలిసిందే. 


కాస్త ఆలస్యంగానైనా, మేల్కొన్న కేంద్రం అప్పట్లో ప్రత్యేక రైళ్ళు, బస్సుల ద్వారా వారి వారి సొంత రాష్ట్రాలకు వలస కూలీలను చేర్చింది. ఈ తతంగమంతా పూర్తి అయిపోయింది. ఇప్పుడు కరోనా కేసుల సంఖ్య పెద్దగా తగ్గకపోగా, మరింత గా విజృంభిస్తోంది. ఈ సమయంలో మళ్లీ తమ సొంత ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వస్తుడడం, చర్చనీయాంశమవుతోంది . ముఖ్యంగా ముంబై నగరానికి వలస కార్మికులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. సొంత ప్రాంతంలో ఉపాధి లభించకపోవడంతో పాటు నగరాల్లో తిరిగి నిర్మాణాలు ప్రారంభం కావడం, కర్మాగారాలు తెరుచుకోవడంతో భారీ సంఖ్యలో కార్మికులు వలస వస్తున్నారు. 


ముంబై నగరానికి దాదాపు ఐదున్నర లక్షల మంది కార్మికులు తిరిగివచ్చినట్లు రైల్వే శాఖ చెబుతోంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ , బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారు వలస వచ్చినట్లు కేంద్రం వద్ద లెక్కలు ఉన్నాయి. దీంతో మళ్లీ ఆయా నగరాల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సమయంలో, వలస కూలీల రాకతో మరింతగా పెరిగే అవకాశం ఉందనే  ఆందోళన నగరవాసుల్లో పెరిగిపోతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: