రాష్ట్రంలో ప్రతిఒక్కరికి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో సీఎం జగన్...పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, అందులో ఇళ్ళు కట్టివ్వాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జూలై 8న దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. సీఎం జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అయితే ఇళ్ల పట్టాల పంపిణీలో అనేక అక్రమాలు జరిగాయని ప్రతిపక్ష టీడీపీ నేతలు ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్నారు.

 

కేవలం టీడీపీనే కాకుండా ఇతర పార్టీల నేతలు కూడా ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆఖరికి నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా దీనిపై ఘాటుగానే స్పందించి, తమ పార్టీ వాళ్ళు ఇళ్ల స్థలాల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారని మాట్లాడారు. కేవలం ప్రతిపక్ష పార్టీలే కాకుండా కొందరు ప్రజలు కూడా ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 

అసలు ఇళ్ల స్థలాల విషయంలో అనేక రకాలుగా అవినీతి జరిగిందని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు. మొదట ఇళ్ల స్థలాల కోసం సేకరించే భూములు విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు, ప్రభుత్వం దగ్గర నుంచి ఎక్కువ ధర తీసుకుని, భూములు ఇచ్చిన రైతులకు తక్కువ ధర చెల్లించారని తమ్ముళ్ళు చెబుతున్నారు. ఇక మంచి రేటు ఇప్పించినందుకు అందులో వాటా ఇవ్వమని చెప్పి వచ్చిన డబ్బులన్నీ వైసీపీ నాయకులే లాక్కొని మోసం చేశారని టాక్.

 

ఇక కొన్ని చోట్ల పేదల సాగు చేసుకుంటున్న భూములని బలవంతంగా లాక్కున్నారని, ఇంకొన్ని చోట్ల గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్ల స్థలాలని లాక్కుని, ఇప్పుడు మళ్ళీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని అంటున్నారు. అలాగే ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసే భూములు కొన్ని స్ధానిక వైసీపీ నేతలవేనని, మార్కెట్ ధర కంటే అధికంగా పెంచి ఎకరం రూ.5 లక్షలు విలువ చేయని భూమిని రూ.45 లక్షల నుంచి రూ. 75 లక్షలకు కొన్నారని ఆరోపిస్తున్నారు.

 

అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇస్తామని పేదల నుంచి డబ్బులు వసూలు చేశారట. దాదాపు రూ.200 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఇవేగాకుండా అటవీప్రాంతాన్ని, చెరువులని, కాలువలని కబ్జా చేసి ఇళ్ల స్థలాలుగా మార్చేశారని, ఇలా  చాలారకాలుగా ఇళ్ల పట్టాల విషయంలో వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని తమ్ముళ్ళు ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: