పెళ్లంటే నూరేళ్ల పంట.. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి పెళ్లి అనే బంధంతో ఒక్కటవుతారు జంట.  వివాహబంధంతో  తమ నూరేళ్ల జీవితం కోసం ఎన్నో కలలు కంటుంటారు. అలాంటిది ఓ పెళ్లి కూతురు కొద్ది క్షణాల్లో తాలిబొట్టు కట్టించుకుంటుందన్న సమయంలో పెళ్లి పీఠలపైనే కుప్పకూలిపోయింది.  ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ పెళ్లిలో విషాదం చోటు చేసుకుంది.  కాళ్ల పారాణి ఇంకా ఆరక ముందే పెళ్లి కుతూరు మృత్యు ఒడిలోకి చేరింది. కనౌజ్‌ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను కంట తడి పెట్టించింది. అగ్నిసాక్షిగా ఒక్కటైన ఆ జంట ఆనందంగా బరాత్‌ నడుమ ఇంటికి చేరుకునేది. కానీ అంతలోనే వారిపై విధి చిన్నచూపు చూసింది. పెళ్లి ఆచార వ్యవహారాలు పూర్తయ్యేలోపే వధువు కన్నుమూయగా, వరుడు ఒంటరిగా ఇంటికి చేరుకున్నాడు.

 

ఈ హృదయ విదారక సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్‌ జిల్లా థాథియా పోలీస్‌ సర్కిల్‌లోని భగత్‌పూర్వ గ్రామంలో చోటుచేసుకుంది.  సంజయ్‌, వనితకు వివాహం నిశ్చయంకాగా, వధువు ఇంట్లో శుక్రవారం రాత్రి పెళ్లి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వరుడు తన కుటుంబ సమేతంగా వధువు ఇంటికి చేరుకున్నాడు. పెళ్లితంతు జరుగుతున్న సమయంలో వనిత ఒక్కసారిగా పెళ్లి పీటలపై కుప్పకూలిపోయింది. ఆందోళన చెందిన బంధువులు వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కరోనా భయం వెంటాడుతుండటంతో వైద్యులు చేర్చుకునేందుకు నిరాకరించారు. 

 

కొవిడ్‌ పరీక్షల్లో నెగెటివ్‌గా వస్తేనే జాయిన్‌ చేసుకుంటామని డాక్టర్లు తేల్చిచెప్పారు. ఇక చేసేదేం లేక ఆమెను కుటుంబ సభ్యులు కాన్పూర్‌కు తీసుకెళ్లారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటనతో పెళ్లి పందిట్లో మోగాల్సిన మేళాలు, ఆమె చావుకు భజాలు అయ్యాయి. ఈ ఘటన స్థానికులను గుండెను కలచి వేసిందని అంటున్నారు.  ఈ ఆకస్మిక మరణంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: