దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తూత్తుకుడి లాకప్ డెత్ కేసును.. సీబీఐకి అప్పగించింది తమిళనాడు ప్రభుత్వం. ఈ దారుణ ఘటనకు కారకులైన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు...మరోవైపు.. పోలీసుల తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలోవిరుచుకుపడుతున్నారు. కోలీవుడ్ తారలు తీవ్రంగానే స్పందించారు.

 

తండ్రీకొడుకుల కస్టోడియల్ డెత్‌పై నిరసనలు వెల్లువెత్తడంతో.. తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. ఈకేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. తూత్తుకుడి జిల్లా సాతంకుళం పోలీస్ స్టేషన్ సీఐ శ్రీధర్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది ప్రభుత్వం.. ఇప్పటికే ఎస్సైబాలకృష్ణ, రఘుగణేషన్, కానిస్టేబుళ్లు ముత్తురాజ్, మురుగన్‌లు సస్పెండయ్యారు. వీరిపై శాఖాపరమైన విచారణ జరుగుతోంది.

 

ఈ నెల 19న లాక్‌డౌన్‌ నిబంధనలు  ఉల్లంఘించారంటూ తూత్తుకుడి జిల్లా సాతంకుళంకు చెందిన కలప షాపు యజమాని 63 ఏళ్ల  జయరాజ్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు. రాత్రి 9 గంటల దాటినా అతను షాపుమూయకపోవడంతో..జయరాజ్‌ను అరెస్ట్ చేశారు తండ్రిని విడిపించేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు జయరాజ్‌  కొడుకు 31 ఏళ్ల ఫెనిక్స్‌.  మొబైల్‌ ఫోన్ల వ్యాపరం చేసే ఫెనిక్స్‌పైనా కేసు పెట్టి అరెస్ట్‌ చేశారు  పోలీసులు. అక్కడితో ఆగితే ఫర్వాలేదు... కస్టడీలో ఉన్న తండ్రీకొడుకుల్ని లాకప్‌లో కుళ్లబొడిచారు. దీంతో ముందురోజు పెనిక్స్ చనిపోగా. మరుసటిరోజు తండ్రి జయరాజ్ మృతి చెందాడు. తమకు న్యాయం చేయాలంటూ వారి కుటుంబసభ్యులు.. ఆందోళనకు దిగారు. 

 

తండ్రీ కొడుకుల్ని కొట్టి చంపిన 13 మంది పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వ్యాపారస్తులు ఆందోళనకు దిగారు.  తూతుక్కుడి,  ఉడుంగుడి, పాకాళం, సాతంకుళం ప్రాంతాల్లో  స్వచ్ఛంద బంద్ పాటించారు. దీంతో స్పందించిన మద్రాస్‌ హైకోర్టు... మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించింది. 

 

తూత్తుకూడి ఘటనపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా స్పందించారు. ప్రజల్ని రక్షించాల్సిన పోలీసులే ఇలా ప్రవర్తించడం దారుణమన్నారు. మరోవైపు ఈఘటనలో బాధిత కుటుంబానికి డీఎంకె చీఫ్ స్టాలిన్.. 25 లక్షల రూపాయలు సాయం ప్రకటించారు..  


 
తండ్రీకొడుకుల కస్టోడియల్‌ డెత్‌పై సినీ సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో మండిపడుతున్నారు. సుచీ లీక్స్‌ సుచిత్ర, రాశిఖన్నా, హన్సిక, జయం రవి, జీవా తదితరులు జస్టిస్‌ ఫర్‌ జయరాజ్‌ అండ్‌ ఫెనిక్స్‌ హ్యాష్‌ ట్యాగ్‌తో కామెంట్స్‌  పోస్టు చేస్తున్నారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాశారు డీఎంకే ఎంపీ  కనిమొళి. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించి, బాధ్యులైన అధికారులపై  కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: