నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించే రీతిలో చైనా ప్రవర్తిస్తోంది. ఓవైపు సరిహద్దు సమస్యపై భారత్ తో చర్చిస్తూనే మరోవైపు బలగాలను మోహరిస్తోంది. ఇప్పటికే డ్రాగన్‌ తీరు గమనించిన భారత్‌ కూడా సన్నద్ధతను వేగవంతం చేసింది. 

 

ఇండియా - చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఇరు దేశాల సైనికాధికారుల మధ్య జరిగిన చర్చలు సానుకూల ఫలితం ఇవ్వలేదు. దీంటో అటు చైనా బలగాల సంఖ్య భారీగా పెంచుతోంది. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను ఎల్ఏసీ వెంబడి మోహరిస్తోంది. డ్రాగన్ కు దీటుగా భారత్ కూడా బలగాల్ని సరిహద్దులకు తరలిస్తోంది. యుద్ధ విమానాల్ని మోహరించింది. ఇప్పటికే ఆకాశ్‌ గగనతల రక్షణ వ్యవస్థను చైనా సరిహద్దులకు తరలించింది. 

 

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని స్కర్దూ వాయుసేన స్థావరంలో గత వారం చైనాకు చెందిన ఐఎల్‌-78 ట్యాంకర్‌ విమానాన్ని భారత్‌ గుర్తించింది. ఈ విమానం యుద్ధవిమానాలకు గాల్లో ఇంధనం నింపుతుంది. తూర్పు లద్దాక్‌లో చైనా వాయుసేన కార్యకలాపాలు ముమ్మరం అయ్యాయి. ఈ నేపథ్యంలో వాటికి మద్దతుగా పీవోకేలోని స్కర్దూను కూడా ఉపయోగించుకొనే అవకాశం ఉంది. 

 

వాస్తవాధీన రేఖ వెంబడి చైనా వాయుసేన స్థావరాల్లో ఇటీవల కాలంలో కదలికలు చురుగ్గా ఉన్నట్లు భారత సైన్యం గుర్తించింది. దీంతో స్కర్దూ స్థావరాన్ని జె17 విమానాలకు అనువుగా పాక్‌ గతేడాది అభివృద్ధి చేసింది. భారత్‌ అత్యవసరంగా 21 మిగ్‌29లు, 12 సుఖోయ్‌లు కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిలో భూతలంపై దాడులకు, నౌకాదళంలో వినియోగించేలా మార్పులు చేశారు. 

 

మిత్ర దేశాలైన జపాన్‌, భారత్‌, ఆస్ట్రేలియా వంటి దేశాలను బలోపేతం చేసేందుకు అమెరికా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ది నేషనల్‌ డిఫెన్స్‌ ఆథరైజేషన్‌ యాక్ట్‌ 2021 కింద ఈ మూడు దేశాల యుద్ధపైలట్లకు అమెరికాలోని గువామ్‌ స్థావరంలో శిక్షణ ఇవ్వనున్నారు.  ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో అమెరికాకు ఉన్న బలహీనతలను సరిచేసుకోవడంతోపాటు మిత్రదేశాలను బలోపేతం చేయాలని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: