వృద్ధులు, కిడ్నీ, హృద్రోగులపై కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని ఇప్పటి వరకూ చెబుతున్నారు. మద్యం సేవించే వాళ్లు, పొగ తాగేవాళ్లకు కూడా ప్రమాదం ఎక్కువని ఇప్పటి వరకూ మనకు తెలిసిన విషయం. కానీ... మన దేశంలో మధ్యవయస్కులపై కరోనా ప్రభావం అధికంగా ఉంటోంది. తాజా గణాంకాలను బట్టి ఈ విషయం స్పష్టమౌతోంది. 

 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి చనిపోతున్న వాళ్లలో వృద్ధులే అధికంగా ఉంటున్నారు. అలాగే, పదేళ్లలోపు చిన్నారులపై వైరస్‌ పెద్దగా ప్రభావం చూపడం లేదు. అయితే... మన దేశంలో పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. తాజా గణాంకాలను బట్టి చూస్తే 40 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు అధికంగా కరోనా బారిన పడుతున్నారు. మృతుల్లో కూడా ఈ వయస్సు వాళ్లే అధికంగా ఉన్నారు.

 

జూన్‌ 1 నుంచి దేశంలో నమోదయిన మొత్తం మరణాల్లో 66 శాతంపైగా 40 ఏళ్ల పైబడిన వారు... 60 ఏళ్ల లోపు వాళ్లే. కుటుంబ బాధ్యతల దృష్ట్యా వీరు ఎక్కువగా బయట తిరగడమే ఓ కారణం కావచ్చంటున్నారు నిపుణులు. తమ కుటుంబాల్లోని వృద్ధులు, చిన్నారుల విషయంలో అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, ఇంటిల్లిపాదికి అవసరమైనవి సమకూర్చడానికి ఒక్కరైనా బయటకు వెళ్లక తప్పడం లేదు. కొన్ని కుటుంబాల్ని ఇంటి పెద్ద గడప దాటనిదే పూట గడవని పరిస్థితి. ఇటువంటి వాళ్లంతా 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు వారే. తమ కుటుంబాల ఆకలితో పాటు ఇతర అవసరాలు తీర్చడానికి బయటకు వస్తున్న మధ్య వయస్కులు కరోనా వైరస్‌ బారిన పడి అనారోగ్యం పాలవ్వడం, కొందరు చనిపోవడం సంభవిస్తోంది.

 

ఇంటి నుంచి బయటకు రావడం తప్పనిసరైనా... తగిన జాగ్రత్తలు పాటిస్తూ కరోనాను జయించాలని సూచిస్తున్నారు నిపుణులు. తప్పని సరిగా మాస్కులు తప్పనిసరిగా ధరించడంతో పాటు వ్యక్తిగత దూరం పాటించాలని, తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని చెబుతున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని, ఆలస్యమయితే వైరస్ ప్రభావం పెరిగిపోతుందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.

 

లక్షణాలు లేవు కదా అని కరోనాను తేలిగ్గా తీసుకోవద్దంటున్నారు వైద్యులు. కరోనా లక్షణాలు లేకపోయినా... వాళ్లకు అప్పటికే వైరస్‌ సోసినట్టయితే... అది ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉందంటున్నారు. అందువల్ల సాధ్యమైనంత వరకూ తెలిసిన వాళ్లతో కూడా వ్యక్తిగత దూరం పాటించాలన్నది నిపుణుల సూచన. 

మరింత సమాచారం తెలుసుకోండి: