వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు ఎపిసోడ్ ఇపుడు ఏపీ రాజకీయాల్లో యమ కాక పుట్టిస్తోంది. రాజు గారు రూటు ఎటూ అని అంతా అనుకుంటున్న వేళ ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది వైసీపీ, అయితే దీనిమీద రాజు గారు మొదటికే ప్రశ్నించారు.  అసలు షోకాజ్ నోటీస్ ఇచ్చే అర్హత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి లేనేలేదనేశారు. అసలు గొడవంతా సాయిరెడ్డితోనే అన్నట్లుగా మాట్లాడారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే జగన్ని కీర్తిస్తూ రాసుకొచ్చిన రాజుగారి లేఖలో ఆయన ప్రభుత్వాన్ని మాత్రం దెప్పుతూ ఉండడం విశేషం. వైసీపీ సర్కార్ తీసుకున్న అనేక నిర్ణయాలు మీద విపక్ష టీడీపీ ఎలా చీల్చి చెండాడిందో అలాగే రాజుగారి లేఖ కూడా ఉంది. తన వాదనను రాజు గారు పూర్తిగా సమర్ధించుకుంటూనే జగన్ని నంబర్ వన్ సీఎంగా దేశంలో ఉండాలని కోరడం విశేషం.

 

ఈ విధంగా రాజు గారు  ముందరి కాళ్ళకు బంధం వేసేలా తెలివైన ఎత్తుగడకు పాల్పడ్డారని అంటున్నారు. మరో వైపు ఆయన దేశ ప్రధాని మోడీని పొగుడుతున్నారు. ఆయనని కీరిస్తూ పాట కూడా రిలీజ్ చేశారు. అదే సమయంలో వైసీపీ విధానాలు మీద బహిరంగంగా  మాట్లాడే హక్కు తనకు ఉందని అంటున్నారు.

 

జగన్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కూడా రాజుగారు కోరడం విశేషం. మరి ఇస్తే జగన్ తో మాట్లాడుతారా. ఏం మాట్లాడుతారా. కధ ఇంతవరకూ వచ్చిన తరువాత జగన్ రాజు గారి విషయంలో మెత్తబడతారా. రాజకీయ లౌక్యం చూపించి ప్రస్తుతానికి సద్దుమణిగేలా చేసుకుంటారా అన్నది కూడా ఒక చర్చగా ఉంది.

 

అయితే జగన్ మనసుని ఎరిగిన వారు ఎవరూ ఆయన రాజుగారిని పిలిచి మాట్లాడరని అంటున్నారు. ఇక రాజుగారికి కూడా కావాల్సింది అదే. తనకు వేరే తోవ బీజేపీ ఉందని అందుకే ఆయన వైసీపీ హై కమాండ్ ని బ్లాక్ మెయిల్ చేసేలాగే వ్యవహరిస్తున్నారని అంటున్నారు. మరి జగన్ ఈ సమయంలో రాజకీయ  లౌక్యం చూపించి రాజుగారిని పిలిచి మాట్లాడాలని వైసీపీలో కొందరి మాట. అలా కనుక చేస్తే జనం ద్రుష్టిలో రాజు గారికి సానుభూతి కూడా అసలు  రాదని అంటున్నారు.

 

ఒకవేళ జగన్ తో మాట్లాడిన తరువాత కూడా ఆయన యధాప్రకారం రెచ్చిపోతే మాత్రం అపుడు మళ్ళీ షోకాజ్ నోటీస్ అస్త్రం ఉండనే ఉంది అంటున్నారు. మొత్తానికి జగన్ రాజు గారి విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఇపుడు అతి పెద్ద చర్చగా ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: