శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సామెత తెలిసిందే. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అలాగే ఉంది. భారత్ చైనాతో గొడవపడుతుంటే ఆ దేశానికి చెందిన కొందరు పండుగ చేసుకుంటున్నారు. తమ శక్తి కొద్దీ ఆ గొడవను సెలబ్రేట్ చేసుకునే పనిలో పడ్డారు. తమ చేతిలో ఉన్న సోషల్ మీడియాను ఈ విషయంలో వదంతలు వ్యాప్తికి అస్త్రంగా వాడుతున్నారు.

 

 

పాక్- చైనా దోస్తీ విషయం తెలిసిందే. భారత్ ను ఇరుకున పెట్టే అంశంలో ఈ రెండు దేశాలూ చేతులు కలుపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు పాక్ అదే చేస్తోంది. ఆక్రమిత కాశ్మీర్‌ నుంచి చైనాకు సాయం చేస్తోంది. దీనికి పాక్ సోషల్ మీడియా కూడా తన వంతు సాయం చేస్తోంది. పీవోకేలోని స్కర్దు, గిల్గిట్‌ విమానాశ్రయాలు రెండింటికీ కలిపి చైనా 50 జే-10 యుద్ధవిమానాల్ని మోహరించిందని పాక్‌కు చెందిన సోషల్ మీడియా పుకార్లు పుట్టిస్తోంది.

 

 

అసలు విషయం ఏంటంటే.. స్కర్దుకు గానీ, గిల్గిట్‌కు గానీ ఆ స్థాయిలో విమానాల్ని నిలిపేందుకు మౌలికవసతులు లేవు. స్కర్దులో కేవలం 8విమానాలకు మాత్రమే చోటుంది. ఇక గిల్గిట్‌లో విమానాలు లేవని ఈ నెల 24న తీసిన ఉపగ్రహ చిత్రాల్లోనే వెల్లడైంది. అయినా సరే పాక్ సోషల్ మీడియా మాత్రం వదంతులు వ్యాప్తి చేసి పైశాచిక ఆనందం పొందుతోంది.

 

 

ఏదోలా భారత్ ను ఇబ్బంది పెట్టాలన్న దురుద్దేశంతో మన నిబ్బరాన్ని దెబ్బ తీసేలా సోషల్ మీడియాలో కథనాలు వండి వారుస్తున్నారు. మొత్తానికి ఇండియా- చైనా గొడవపడుతుంటే పాకిస్తాన్ సోషల్ మీడియా విషం చిమ్ముతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: