భార‌త్‌పైకి చైనా వ్యూహాత్మ‌కంగానే సైనిక దాడికి సిద్ధ‌మైన‌ట్లు ఒక్కో ప‌రిణామం ఇప్పుడు తెలియ‌జేస్తోంది. సైనిక దాడి..దురాక్ర‌మ‌ణ‌ల్లో దుందుడుకుగా వ్య‌వ‌హ‌రించ‌డం వెనుక యుద్ధ కాంక్ష ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇందుకు ఇటీవ‌ల చైనాభార‌త్‌తో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు..చైనా అధ్యక్షుడి హోదాలో జిన్‌పింగ్ తీసుకున్న కొన్నికీల‌క నిర్ణ‌యాలను కూడా ఏక‌రువు పెడుతున్నారు. కొద్దిరోజుల క్రిత‌మే చైనా మిలటరీ రిజర్వు బలగాలు కూడా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నేతృత్వంలోని కమ్యూనిస్ట్‌ పార్టీ(సీపీసీ), సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌(సీఎంసీ) అజమాయిషీలో ప‌నిచేసే విధంగా చ‌ట్టాల్లో మార్పులు తీసుకురావ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పాలి.

 


దేశానికి ప్రపంచ స్థాయి సైన్యాన్ని నిర్మించడానికి తిరుగులేని నాయకత్వం అవసరమని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా ప్రభుత్వం త‌న అధికారిక మీడియా ద్వారా వివ‌రించింది. రిజర్వు బలగాలు జూలై 1వ తేదీ నుంచి సీపీసీ, సీఎంసీల ఆదేశాలకు లోబడి పనిచేస్తాయని అందులో పేర్కొంది. ప్రస్తుతం రిజర్వు బలగాలు సైనిక విభాగాలు, కమ్యూనిస్టు పార్టీ స్థానిక కమిటీల అజమాయిషీలో ఉన్నాయి.  మావో సెటుంగ్‌ తర్వాత చైనాలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగిన జిన్‌పింగ్‌ ఇప్పటికే సీపీసీ, సీఎంసీలకు నేతృత్వం వహిస్తున్నారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, ప్రపంచంలోనే అతిపెద్ద సంఖ్య‌లో సైన్యాన్ని క‌లిగి ఉంది. దీనిని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (ప్రజా స్వాతంత్ర్య సైన్యం) అని పిలుస్తారు. 

 


దీనిలో నావికా దళం, వాయు దళం ఉన్నాయి. ఏటా సుమారు మూడువేల కోట్ల డాలర్లు ( ఇండియ‌న్ క‌రెన్సీలో 15 వేల కోట్ల రూపాయలు ) ఖ‌ర్చు చేస్తోంది. ఇటీవలి రాండ్ అను సంస్థ ప్రకారం ఈ ఖర్చు రెండు రెట్లు ఎక్కువ! ఇది అమెరికా సంయుక్త రాష్టాల నాలుగు వందల బిలియన్ డాలర్ల తరువాత ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంద‌ని చెప్పాలి. చైనా అణ్వాయుధాల సంప‌త్తిని క‌లిగి ఉండ‌టం గ‌మ‌నార్హం. భార‌త్ కంటే మిన్న‌గా ఆయుధాలను క‌లిగి ఉంది. అయితే బలహీనమైన నావికాదళం చైనాకు లోటుగానే చెప్పాలి. భార‌త నావికా ద‌ళం ఎంతో ప‌టిష్ఠంగా క‌న‌బ‌డుతోంది. ఇదిలా ఉండ‌గా చైనాతో స‌రిహ‌ద్దుల వ‌ద్ద వివాదం త‌లెత్తుతున్న నేపథ్యంలో భారత్‌కు పాక్ కంటే చైనానుంచే ఎక్కువ ప్రమాదముందని భారత వాయుసేనాధిపతి హోమీమేజర్ అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: