ఏపీ ముఖ్య‌మంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం వైయస్‌ జగన్, ఆ దిశలో మరో అడుగు ముందుకు వేశారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు చేపట్టి, అమలు చేస్తున్న ముఖ్యమంత్రి, ఇప్పుడు అత్యవసర వైద్య సేవలందించే 108, 104 సర్వీసుల్లో కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. అత్యున్నత ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వసతులతో 108, 104 సర్వీసుల్లో సమూలు మార్పులు చేసి వాటిని తీర్చిదిద్దారు. విషమ పరిస్థితిల్లో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా చికిత్స అందించేలా వాటిలో మార్పులు చేశారు. వాటి సంఖ్యను కూడా గణనీయంగా పెంచారు. ఇంకా చిన్నారుల కోసం కూడా ప్రత్యేకంగా నియో నేటల్‌ అంబులెన్సులు ప్రారంభిస్తున్నారు. 

 

అనారోగ్యం లేదా ప్రమాదానికి గురైన వారు ఎవరికైనా గుర్తుకు వచ్చే 108 సర్వీసులో సమూల మార్పులు చేశారు. వాటిలో అత్యాధునిక వైద్య సేవలందించే ఏర్పాట్లు చేశారు. కొత్తగా 412 అంబులెన్సులను కొనుగోలుచేసి, ఈ సర్వీసు కోసం సిద్ధం చేయగా, ఇప్పటికే ఉన్న వాటిలో 336 అంబులెన్సులను కూడా వినియోగించనున్నారు. కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్సులలో 282 బేసిక్‌ లైఫ్‌ సపోర్టు (బీఎల్‌ఎస్‌)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్టు (ఏఎల్‌ఎస్‌)తో తీర్చి దిద్దారు. మరో 26 అంబులెన్సులను చిన్నారులకు (నియో నేటల్‌) వైద్య సేవలందించేలా తయారు చేశారు. 

 

బీఎల్‌ఎస్‌ అంబులెన్సులలో స్పైన్‌ బోర్డు, స్కూప్‌ స్ట్రెచర్, వీల్‌ ఛైర్, బ్యాగ్‌ మస్క్, మల్టీ పారా మానిటర్‌ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయగా, ఏఎల్‌ఎస్‌ అంబులెన్సులలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. ఇక నియో నేటల్‌ అంబులెన్సులలో ఇన్‌క్యుబేటర్లతో పాటు, వెంటిలేటర్లను కూడా అమర్చారు. సకాలంలో వైద్యం అందక ఏ ఒక్క రోగి కానీ, ప్రమాదానికి గురైన వారు కానీ, చిన్నారులు కానీ మృత్యువాత పడకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందుకే అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన అంబులెన్సులను పెద్ద సంఖ్యలో ఒకేసారి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. శిశు మరణాలను కూడా పూర్తిగా నివారించే దిశలో ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో అయితే ఫోన్‌ చేసిన 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజెన్సీ (గిరిజన) ప్రాంతాల్లో అయితే 30 నిమిషాల్లో అంబులెన్సులు చేరే విధంగా ఆ స్థాయిలో సర్వీసులు ప్రారంభిస్తున్నారు.

ప్రతి అంబులెన్సును ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ (ఈఆర్‌సీ)తో అనుసంధానం చేయడం ద్వారా, ఫోన్‌ చేసిన వారిని వేగంగా ట్రాక్‌ చేసే వీలు కలుగుతుంది. అదే విధంగా ప్రతి అంబులెన్సులో ఒక కెమెరా, ఒక మొబైల్‌ డేటా టెర్మినల్‌ (ఎండీటీ), మొబైల్‌ ఫోన్‌తో పాటు, రెండు వైపులా మాట్లాడుకునే విధంగా ఆటోమేటిక్‌ వెహికిల్‌ లొకేషన్‌ టాండ్‌ (ఏవీఎల్‌టీ) బాక్స్‌ను కూడా ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: