లడక్ లో  చైనాతో వివాదం ముదురుతుండటంతో భారత్‌ తన అస్త్ర శస్త్రాలకు పదునుపెడుతోంది. ఇప్పటికే దిగుమతి కావాల్సి ఉన్న ఆయుధాలను వేగంగా భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు చేపడుతోంది. దీంతోపాటు అవసరమైతే అత్యవసర కొనుగోళ్లు చేసేందుకు కూడా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఫ్రాన్స్‌ నుంచి రఫేల్‌ యుద్ధ విమానాలను వేగంగా తెప్పించేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టింది.

 

భారత అమ్ములపొది మరింత పటిష్టం కానుంది. వచ్చేనెల 27 నాటికి అత్యాధునిక క్షిపణులను అమర్చిన రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. లెక్కప్రకారం నాలుగు విమానాలు రావాల్సి ఉండగా.. భారత్‌ మొత్తం ఆరు విమానాలను ఇవ్వాలని ఫ్రాన్స్‌ను కోరుతోంది. దీనికి ఫ్రాన్స్‌ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దాదాపు ఎనిమిది విమానాలు తయారై సర్టిఫికేషన్‌ దశలో ఉన్నట్లు సమాచారం. మరోపక్క భారతీయ పైలట్లకు ఈ విమానాలపై శిక్షణ కొనసాగుతోంది. వారే అక్కడి నుంచి విమానాలను భారత్‌లోని అంబాలా వాయుసేన స్థావరానికి చేర్చే అవకాశం ఉంది. 

 

ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థను కూడా వీలైనంత తొందరగా భారత్‌కు రప్పించేందుకు ప్రభుత్వం రష్యాపై ఒత్తిడి తెస్తోంది. రష్యా ముందుగా సరఫరా చేస్తామన్న సమయానికంటే ముందే ఇవ్వాలని ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రష్యాను కోరినట్లు సమాచారం. దీంతోపాటు భారత్‌కు అవసరమైన బిలియన్‌ విలువైన అదనపు ఆయుధ సామగ్రిని కూడా కొన్ని వారాల్లో సరఫరా చేసేందుకు రష్యా అంగీకరించింది.  మరోపక్క చైనా ఇటువంటి గగనతల రక్షణ వ్యవస్థనే కొనుగోలు చేసింది. దీనిని లద్దాఖ్‌లో మోహరించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. 

 

శతఘ్నుల్లో వినియోగించే కీలకమైన గుండ్లను భారత్‌ ఆర్డర్‌ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా భారత్‌కు ఇంటెలిజెన్స్‌ సాయం అందజేస్తోంది. దీంతోపాటు గురిచూసి శత్రుస్థావరాలను కొట్టగలిగే ఎక్స్‌క్యాలిబర్‌ శతఘ్ని గుండ్లను కొనుగోలు చేయాలని భారత్‌ భావిస్తోంది. వీటిని ఎం777 శతఘ్నుల్లో వినియోగించనున్నారు.  జీపీఎస్ ఆధారంగా లక్ష్యాలను ఛేదించే ఈ గుండ్లు పర్వత యుద్ధతంత్రంలో కీలక పాత్ర పోషించనున్నాయి.  

 

రఫెల్ యుద్ధ విమానాలు 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సులభంగా చేధించగలవు. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ కచ్చితత్వంతో పనిచేసే ఈ ఫైటర్‌ జెట్స్‌లో ఆకాశం నుంచి ఆకాశంలోని లక్ష్యాలపైకి మెరుపువేగంతో దాడిచేయగలిగే సామర్థ్యం ఉంది. ఆకాశంతో పాటు భూమిపైన లక్ష్యాలను కూడా రఫెల్ సులభంగా చేధిస్తుంది. ఈ విమానాల నుంచి క్షిపణులను కూడా ప్రయోగించవచ్చు. భారత అవసరాలకు అనుగుణంగా రఫెల్‌లో మార్పులు చేశారు.  ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత అధునాతన యుద్ధ విమానంగా పేరున్న రఫెల్‌తో పాక్, చైనాలకు చెక్ పెట్టవచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: