తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా పేర్కొంటున్న కొండపోచమ్మ సాగర్‌కు గండిప‌డ‌టం, పెద్ద ఎత్తున నీరు వృథా అవ‌డం క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. స‌హ‌జంగానే ఈ ప‌రిణామం అధికార పార్టీని ఇరుకున ప‌డేయగా ప్ర‌తిప‌క్షాలు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఇర‌కాటంలో ప‌డేసేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే విరుచుకుప‌డే కాంగ్రెస్ నేత‌, ఎంపీ రేవంత్ రెడ్డి ఈ ఎపిసోడ్‌పై త‌న‌దైన శైలిలో స్పందించారు. కొండపోచమ్మ సాగర్, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలు రోజుకోకటి బయట పడుతున్నాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

 

 

కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఫార్మ్ హౌస్‌కు పోయే కాలువకే పెద్ద గండి పడిందంటే...అక్క‌డి ప‌నులు ఎంత నాణ్య‌త‌తో జ‌రిగాయో అర్థం చేసుకోవ‌చ్చున‌ని రేవంత్ రె్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి నెల కూడా కాలేదని పేర్కొన్న రేవంత్ రెడ్డి ఇంత త‌క్కువ స‌మయంలో రెండు ప్రధాన కాలువలు గండ్లు పడ్డాయంటే అవినీతి, ప‌నుల్లో నాణ్య‌త లోపం ఎలా ఉండో అర్థం చేసుకోవ‌చ్చున‌ని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలోనే , కేసీఆర్ ఫార్మ్ హౌస్‌కు పోయే కాలువ పనుల్లోనే నాణ్యత ఇంత ఘోరంగా ఉంటే ఇక రాష్ట్రంలో జరిగిన కాలువలు, జలాశయాల నాణ్యత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చున‌ని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

 

చిన్న కాలువల పరిస్థితి ఇలా ఉంటే ఇక సర్ఫేస్‌లో నిర్మించిన 50 టీఎంసీల మల్లన్న సాగర్, 15 టీఎంసీల కొండపోచమ్మ సాగర్, గందమల్లల పరిస్థితి ఎలా ఉండబోతోందో ఆలోచిస్తే భయం వేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆ జలాశయాలకు ఇలాగే గండిపడితే ఒక్క ఊరు మిగలదని రేవంత్ రెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వాటి పరిధిలో ఉన్న అన్ని గ్రామాలు జలవిలయంలో కొట్టుకుపోతాయని ఆయ‌న పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, నిర్మాణ కంపెనీ కమీషన్ల కక్కుర్తికి ఈ నాణ్యత లోపలే పరాకాష్ట అని ఆయ‌న మండిప‌డ్డారు. లక్ష కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టు లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అవినీతి సొమ్ముతో కేసీఆర్ రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారని మండిప‌డ్డారు. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీబీఐ చేత ఈ పనులపై విచారణ జరిపి అక్రమాలకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పనిమంతుడు పందిరేస్తే పిట్టొచ్చి వాలితే.. పుటుక్కున కూలిందట.... అట్లుంది కేసీఆర్ ఎవ్వారం అంటూ రేవంత్ రెడ్డి త‌న మార్కు సెటైర్ వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: