కొన్ని రోజుల క్రితం ఆయుర్వేద కంపెనీ పతంజలి నిర్వాహకులు కరోనా మహమ్మారికి మందు కనిపెట్టామని కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంలో పతాంజలి యూటర్న్ తీసుకుంది. తాము కరోనా నివారణకు ఎలాంటి మెడిసిన్‌ తయారు చేయలేదంటూ తెలిపింది. ‘కరోనా కిట్‌’ పేరిట ఎలాంటి అమ్మకాలు ఇప్పటివరకు చేపట్టలేదని పేర్కొంది. గత మంగళవారం పతాంజలి కరోనాను కట్టడి చేసేందుకు కరోలిన్‌ అనే మందును కనిపెట్టినట్లు చెప్పిన సంగతి తెలిసిందే. 
 
యోగా గురువు రాందేవ్‌ బాబా పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఈ మందును కరోనా లక్షణాలున్న 100 మంది రోగులపై ప్రయోగించగా, వారిలో దాదాపు 65 మంది పూర్తిగా కోలుకున్నారని చెప్పారు. పతంజలి తాజాగా ఈ మందును కరోనా కోసం తయారు చేయలేదంటూ చేసిన ప్రకటనతో నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. రాందేవ్‌ బాబా, పతంజలి చైర్మన్‌ బాలకృష్ణ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. 
 
భారత ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఇప్పటికే కరోనిల్‌ ప్రకటనలను నిషేధించింది. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం.. కరోనా నిరోధక మందుల తయారీకి పతంజలి కంపెనీ ఎలాంటి లైసెన్స్‌లు తీసుకోలేదని గతంలో తెలిపింది. దగ్గు నివారణ మందనుకొనే తాము కరోలిన్‌ మందుకు అనుమతించామని కరోలిన్‌ మందుపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు ఇచ్చామని తెలిపింది. తాజాగా పతంజలి ఈ విషయంపై స్పందించింది. 
 
కరోనా కిట్‌ పేరును ఎక్కడా వాడటం లేదని.... దివ్య స్వసారి వతి, దివ్య కరోనిల్‌ టాబ్లెట్‌, దివ్య అను టేల్‌ అనే మెడిసిన్‌తో కూడిన ప్యాకేజీలను షిప్పింగ్ చేస్తున్నామని పేర్కొంది. మందులకు సంబంధించిన ప్రయోగం విజయవంతమైన విషయాన్ని మాత్రమే మీడియా ముందు తెలిపామని.... అంతే తప్ప అది కరోనా చికిత్సకు ఉపయోగపడుతుందని కూడా ఎలాంటి పబ్లిసిటీ చేయలేదని అన్నారు. మనుషులపై ప్రయోగించినపుడు సత్ఫలితాలు ఇచ్చిందనే చెప్పామే తప్ప.. ఇది కరోనాను నయం చేస్తుందని ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదని పతాంజలి నిర్వాహకులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: