మోడీ అంటేనే ఆరడుగుల చాతీ, ప్రపంచానికే మేటి నాయకుడు అని  పెద్ద ప్రచారం. రెండు సార్లు బీజేపీకి ఫుల్ మెజారిటీ తెచ్చి కమల వికాసాన్ని చూపించారని పేరు. రాజకీయ గండర గండడు అని అంటారు. చాణక్యుడు అని కూడా చెబుతారు. ఇన్ని బిరుదులు ఉన్న మోడీ కీర్తి అలాగే ఉండేదేమో. కానీ కంటికి కనబడని సత్రువు కరోనా వచ్చేసి మోడీ ప్రభను ఇలా ఒక్కసారిగా  తగ్గించేసింది.

 

దేశంలో గత ఆరేళ్ళలో  ఎన్నో జరిగాయి. మోడీ తప్పు చేశారు అని విపక్షం గొంతు చించుకున్నపుడుల్లా అది దేశం కోసమని జనం భావించారు. పెద్ద నోట్లు రద్దు చేసి చలి కాలంలో జనాలను రోడ్లమీద పెట్టారు. అందులో చాలా మంది చనిపోయారు. పెద్ద నోట్లు రద్దు చేస్తే దేశంలో ఉగ్రవాదం పోతుందని చెప్పారు. ఉగ్రవాదుల చేతుల్లో నోట్లు కరకరలాడవని అన్నారు. సరే ఇది మంచిదే అనుకున్నారు. నల్ల కుబేరుల బండారం బయటపడుతుందని, దేశం ఆర్ధికంగా పరుగులు తీస్తుందంటే సరేనన్నారు.

 

ఇక జీఎస్టీ కధా ఇంతే. దేశమంతా ఒకే రేట్లు, అన్నీ తక్కువకే వస్తాయి. రేటు మీద రేటు ఉండదని ఊదరగొట్టారు. అయితే జరిగింది వేరు, చిన్న వ్యాపారులు, చిల్లర వ్యాపారులూ కొట్టుకుపోయారు. ఇలా ఎన్ని జరిగినా, దేశంలో నిరుద్యోగం పెరిగినా కూడా మోడీయే మా  దేవుడు అన్నారు. పాకిస్థాన్ పీచమణచిన నేతగా కితాబు ఇచ్చారు. మళ్లీ గెలిపించారు.

 

ఇక కరోనా మహమ్మారా. అదేంతా మా మోడీ ముందు అంటూ చప్పట్లు కొట్టి మరీ  జనతా కర్ఫ్యూ చేపట్టారు, ఆ తరువాత పంటి బిగువున లాక్ డౌన్ రెండు నెలలు భరించారు. మధ్యలో దీపాలు వెలిగించమంటే వెలిగించారు. ఆ కీటకం చస్తుందని అనుకున్నారు. ఇక ఇతర దేశాల మాదిరిగా మోడీ తమ ఖాతాల్లో ఎంతో కొంత మొత్తాలు వేసి లాక్ డౌన్ వేళ ఆదుకుంటారని ఎదురుచూశారు. 

 

ఇరవై లక్షల కోట్లతో ప్యాకేజిని ప్రకటిస్తే ఆ మూటలు ఎక్కడని కళ్ళు అప్పగించి చూశారు. తీరా అందులో పెద్దగా ఏమీ లేదని, తమ వద్దకు ఏ రూపాయి రాదని తెలిసాక మాత్రం జనాలు మండిపోతున్నారు. అది చాలదన్నట్లుగా లాక్ డౌన్ సడలింపుతో కేసులు పెరిగిపోయాయి. ఎక్కడో ఉందనుకున్న కరోనా ఇపుడు ప్రతీ ఇంటి ఎఉదురుగా రోగి రూపంలో కనిపిస్తోంది. 

 

ఈ వేళ మళ్లీ  టీవీ ఎదుటకు వచ్చిన మోడీ ఏదైనా స్వాంతన వచ్చే ప్రకటన చేస్తారనుకుంటే ఆయన మాత్రం తాపీగా మాస్కులు పెట్టుకోండి మూసుకు కూర్చోండి అంటూ హిత బోధ చేసి చక్కా  వెళ్ళిపోయారు. ఇపుడు మోడీని నమ్మి చప్పట్లు కొట్టాం, దీపాలు వెలిగించాం, మీ మాస్కులు మీ ఇష్టమంటూ పెద్దాయన చెప్పేసి వెళ్ళిపోతూంటే  ఇదేనా మోడీజీ కరోనా మీద ఆరడుగుల ఛాతి చేసిన యుధ్ధమంటూ భారత జనం గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. మా చావు మేము చావడమేనా. ఇదేనా భారత్ గెలవడం అంటే అని కూడా నిగ్గదీస్తున్నారు మరి మోడీ ఉపన్యాసమే చెబుతారు తప్ప వీటిని సమాధానం ఉండదుగా.

మరింత సమాచారం తెలుసుకోండి: