ప్రపంచవ్యాప్తంగా కరోనా టెన్షన్ కొనసాగుతుండగానే.. మరో ప్రాణాంతక వైరస్ చైనాలో వెలుగు చూసింది. స్వైన్ ఫ్లూ తరహా కొత్త వైరస్ కు జీ4 వైరస్ గా పేరు పెట్టారు. పందుల నుంచి మనుషులకు సోకిందని గుర్తించారు. మనిషి రోగనిరోధక శక్తి ఈ వైరస్ ను ఎదుర్కోలేదంటున్న సైంటిస్టుల మాటలు.. మరింత భయపెడుతున్నాయి. 

 

కరోనా మహమ్మారితో ఇప్పటికే ప్రపంచమంతా బెంబేలెత్తిపోతుంటే.. చైనా పరిశోధకులు మరో చేదు అంశాన్ని బయటపెట్టారు. రాబోయే కాలంలో మహమ్మారిగా మారే ప్రమాదం ఉన్న మరో వైరస్‌ను గుర్తించినట్లు తెలిపారు. ఈ మేరకు అమెరికాకు చెందిన ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ జర్నల్‌లో వారి పరిశీనలను ప్రచురించారు.

 

కొత్త వైరస్‌కు జీ-4గా నామకరణం చేశారు. 2009లో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన హెచ్‌1ఎన్‌1 వైరస్‌ జాతి నుంచే ఇది పుట్టిందని పరిశోధకులు గుర్తించారు. మనుషులకు సోకడానికి అవసరమయ్యే లక్షణాలన్నీ ఈ వైరస్‌లో ఉన్నట్లు గుర్తించారు. 2011 నుంచి 2018 మధ్య చైనాలోని పది ప్రావిన్సుల్లో ఉన్న జంతువధశాలలు, పశువైద్యశాలల్లో ఉన్న పందుల నుంచి దాదాపు 30వేల నమూనాలను సేకరించారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో తీసుకుంటున్నట్లుగా నమూనాలను పందుల ముక్కుల్లో నుంచే తీసుకున్నారు. అనంతరం వాటిపై పరిశోధనలు జరపగా.. దాదాపు 179 రకాల స్వైన్‌ ఫ్లూ వైరస్‌లను కనుగొన్నారు. వీటితో ఫెర్రెట్‌ అనే ముంగిస జాతికి చెందిన జంతువుపై ప్రయోగాలు చేశారు. వైరస్‌లు సోకినప్పుడు మనుషుల్లో కనబడే లక్షణాలే దాదాపు ఫెర్రెట్‌లోనూ కనిపిస్తుంటాయి. అందుకే ఫెర్రెట్‌పై ప్రయోగాలు జరుపుతుంటారు. కొత్తగా కనుగొన్న వైరస్‌లన్నింటిలోకెల్లా జీ-4 వైరస్‌ ఫెర్రెట్‌లో ప్రమాదకర లక్షణాలు చూపినట్లు పరిశోధకులు గుర్తించారు. అలాగే మానవ కణాల్లోనే ఇది వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు గమనించారు.

 

పందులకు సంబంధించిన పరిశ్రమల్లో పనిచేసే ప్రతి 10 మందిలో ఒకరికి ఈ కొత్త వైరస్‌ ఇప్పటికే సోకిందని అధ్యయనంలో తేలింది. వారిపై యాంటీబాడీ పరీక్షలు జరపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని బట్టి ఇది జంతువుల నుంచి మనుషులకు సోకుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఇలా మనుషులకు సంక్రమిస్తుండడం వల్ల మానవ శరీరంలో ఇది మరింత శక్తిమంతంగా వృద్ధి చెందేలా కాలక్రమంలో రూపాంతరం చెందే అవకాశం ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇది ఒకరి నుంచి మరొకరికి సోకుతుందా.. లేదా.. అన్న అంశంపై మాత్రం ఇంకా లోతైన పరిశోధన జరగాల్సి ఉంది. ఇలా జరిగితే సమీప భవిష్యత్తులో మరో మహమ్మారి విరుచుకుపడే ప్రమాదం లేకపోలేదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సాధారణంగా వచ్చే ఫ్లూల వల్ల ఇప్పటికే మనుషుల్లో ఏర్పడ్డ రోగ నిరోధక శక్తి.. జీ-4 నుంచి కాపాడే అవకాశం లేదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. 

 

మానవ అవసరాలను అనుగుణంగా జరుగుతున్న జంతు పోషణ వల్ల మనుషులకు నిరంతరం ముప్పు పొంచి ఉంటుందన్న విషయాన్ని తాజా అధ్యయనం చెబుతోంది. కృత్రిమ పశుపోషణ వల్ల జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధుల ముప్పు క్రమంగా పెరుగుతోందని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: