విశాఖజిల్లాను గ్యాస్ లీక్ ప్రమాదాలు కుదిపేస్తున్నాయి. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన మరుగున పడక ముందే సాయినార్ లైఫ్ సైన్సెన్స్ కంపెనీ మరో ఇద్దరిని మింగేసింది. ఫార్మా సిటీలో అర్ధరాత్రి జరిగిన ప్రమాదం భయాందోళనలు సృష్టించింది. మానవ తప్పిదాలే గ్యాస్ లీక్ అవ్వడానికి కారణమని ప్రాథమిక అంచనా. ప్రమాదంపై విచారణ కమిటీ ఏర్పాటు చేయగా...పరిశ్రమను తాత్కాలికంగా షట్ డౌన్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

 

సాయినార్ ఫార్మాసిటీలో రియాక్టర్ దగ్గర సిబ్బంది ఉత్పత్తిని పర్యవేక్షిస్తున్నారు. నైట్ షిఫ్ట్ లో ఇంఛార్జ్ తో పాటు 12 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా బెంజిమెడిజోల్ విషవాయువులు ఉధృతంగా కమ్మేయడంతో అధిక మొత్తంలో గ్యాస్ పీల్చిన ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరిని గాజువాకలోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరు మార్గమధ్యంలో కన్నుమూశారు. మరో ఉద్యోగి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన ముగ్గురి ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు ప్రకటించారు.  

 

సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రమాదానికి మానవతప్పిదం, యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. గతంలో ఇక్కడ చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు మరణించారు. బెంజ్ మెడిజోల్ లీక్ వల్ల జరిగిన దుష్ప్రరిణామాలపై విచారణకు త్రిసభ్య కమిటీని జిల్లా కలెక్టర్ నియమించారు. 

 

కెమికల్ మిక్సింగ్ జరిగిన తర్వాత వడపోత ప్రక్రియ ప్రారంభమైనప్పుడు.. విషరసా యనాలతో కూడిన వాయువులు విడుదల అయ్యాయని గుర్తించారు. అధిక ఒత్తిడికి గురికావడం వల్ల హోస్ పైప్ దెబ్బతిని గ్యాస్ లీజ్ జరిగిందని భావిస్తున్నారు.ప్రమాదం జరగడానికి గల కారణాలను విశ్లేషించిన తర్వాత  బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. 

 

గ్యాస్ లీక్ ఘటన వెలుగు చూసిన తర్వాత టీడీపీ, బీజేపీ, సిపిఐ నాయకులు ఫార్మాసిటీ కి చేరుకున్నారు. కెమికల్ ఫ్యాక్టరీని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. జ్యుడీషియల్ ఎంక్వైరీ కి ఆదేశించాలని, స్టైరిన్ గ్యాస్ మృతుల తరహాలోనే పరిహారం చెల్లించాలని కోరారు. గ్యాస్ లీక్ ప్రమాదం తర్వాత సాయినార్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ తాత్కాలికంగా షట్ డౌన్ అయింది. త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా చర్యలు ఉండనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: