హైద‌రాబాద్‌లో జూలై మొద‌టి వారంలో లాక్ డౌన్ ఉంటుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద‌గ్గ‌రే రాష్ట్ర వైద్యాశాఖ అధికారులు హైద‌రాబాద్‌లో ప‌రిస్థితిని పేర్కొంటూ లాక్ డౌన్ విధించాల‌నే ప్ర‌తిపాద‌న పెట్టిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. క‌రోనా విస్తృతిని అరిక‌ట్టేందుకు లాక్ డౌన్ విధించాల‌నే అంశాన్ని రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఏర్పాటు చేసి నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఇదిలాఉండ‌గా, హైద‌రాబాద్ నగరంలో రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వినియోగదారులు, వర్కర్లు, తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నేటి నుంచి జూలై5 వరకు సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ పాటిస్తున్నట్లు దిల్‌సుఖ్‌నగర్‌ వెంకటాద్రి ట్రేడర్స్‌ వస్త్ర వ్యాపారుల సంఘ సభ్యులు తెలిపారు. 

 

హైద‌రాబాద్‌లో సోమవారం స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలను మూసివేసి సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ పాటించారు. ఈ సందర్భంగా వెంకటాద్రి ట్రేడర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సామ మల్లారెడ్డి మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో అందరూ భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మ‌రోవైపు, నగరంలోని మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారన్న వార్తల నేపథ్యంలో మలక్‌పేట గంజ్‌ కొనుగోలుదారులతో సందడిగా మారింది. నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలొస్తాయన్న ప్రచారంతో పాటు సరుకులకు కొరత ఏర్పడుతుందని ఆందోళన చెందారు. ఇదే అదునుగా భావించి ప్రజలు ముందస్తు జాగ్రత్తగా నిత్యావసర సరుకుల కొనుగోళ్లకు ఎగబడ్డారు. 

 


జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం నిర్ణయించారు. జిహెచ్ఎంసి పరిధిలో కొద్ది రోజుల పాటు తిరిగి లాక్ డౌన్ విధాంచాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సిఎం చెప్పారు. ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఏమీలేదని, అందరికీ సరైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: