భారత్ చైనా వివాదం అంతకంతకూ ముదురుతోంది. ఇప్పటికే 59 చైనా యాప్ లపై బ్యాన్ విధించిన భారత్ డ్రాగన్ విషయంలో ఒకింత కఠినంగానే వ్యవహరిస్తోంది. భారత్ చైనా కీలక దిగుమతులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని.... ఇందుకోసం అత్యున్నత స్థాయి వర్గాలతో సంప్రదింపులు జరుపుతోందని తెలుస్తోంది. వచ్చే సోమవారం చైనా ఉత్పత్తుల దిగుమతుల విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకోనుంది. 
 
భారత్ ఈ నిర్ణయం అమలు చేస్తే మాత్రం చైనా ఉత్పత్తి సంస్థలు భారీగా నష్టపోతాయి. గత నెల 15న గల్వాన్ లోయ ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం కేంద్రం చైనా 5జీ పరికరాల దిగుమతులకు కూడా చెక్ పెట్టనుందని తెలుస్తోంది. ఇందుకోసం కేంద్రం కేంద్ర మంత్రులు, అధికారులతో కూడిన ఒక కమిటీని నియమించింది. 
 
కేంద్రం 5జీ పరికరాల దిగుమతి గురించి కమిటీ సూచనల ఆధారంగా నిర్ణయం ప్రకటించనుంది. దేశంలో ఈ సంవత్సరం మార్చిలో 5జీ స్పెక్ట్రం వేలం జరగాల్సి ఉన్నా కరోనా విజృంభణ వల్ల వాయిదా పడుతూ వస్తోంది. భారత్ 5జీ పరికరాలపై నిషేధం విధిస్తే దాని ప్రభావం హువాయ్ తో పాటు పలు ఎలక్ట్రానిక్ సంస్థలపై పడుతుంది. ఈ నిర్ణయం వల్ల దేశీయ మొబైల్ ఆపరేటర్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 
 
కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే భారత్ లో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రావడానికి మరికొన్నేళ్లు పడుతుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం భారత వినియోగదారులపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. చైనా యాప్స్ పై భారత్ నిషేధం విధించటంతో షాక్ లో ఉన్న చైనాకు అమెరికా మరో షాక్ ఇచ్చింది. చైనాకు చెందిన హువావే టెక్నాలజీస్, జెడ్.టీ.ఈ కార్పొరేషన్లపై నిషేధం విధించింది.         

మరింత సమాచారం తెలుసుకోండి: