దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో దాదాపు 80 శాతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతూ ఉండటం గమనార్హం. మరోవైపు కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లాక్ డౌన్ అమలు కావచ్చనే ప్రచారం జరుగుతోంది. 
 
సీఎం కేసీఆర్ కరోనా వైరస్ నివారణ కోసం అనుసరించే వ్యూహాన్ని స్వయంగా ప్రకటిస్తామని చెప్పడంతో లాక్ డౌన్ అమలు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు. లాక్ డౌన్ ప్రచారంతో ఆంధ్రలోకి తెలంగాణ వాహనాలు బారులు తీరాయి. సొంతగ్రామాలకు ఆంధ్రావాసులు క్యూ కట్టడంతో విజయవాడ - హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సాయంత్రం 7 గంటల వరకే అధికారులు వాహనాలను అనుమతిస్తున్నారు. 
 
రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఆ సమయంలో వాహనాల రాకపోకలకు అనుమతులు లేవని అధికారులు చెబుతున్నారు. దీంతో వాహనదారులను సరిహద్దుల్లోనే ఆపివేస్తుండగా అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. నేటి నుంచి అన్ లాక్ 2.0 నిబంధనలు అమలులోకి రానున్నాయి. అయితే తెలంగాణ అధికార వర్గాల్లో లాక్ డౌన్ ఉండకపోవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. 
 
తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతుందని సమాచారం అందుతోంది. ప్రభుత్వ వర్గాలు సైతం లాక్ డౌన్ వల్ల కరోనా కట్టడి కాకపోవచ్చని అభిప్రాయపడుతున్నాయి. ప్రభుత్వం కరోనా విజృంభిస్తోన్న ప్రాంతాల్లో మాత్రమే కఠిన చర్యలకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ వల్లే కరోనాను నియంత్రించడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ నగరంలో లాక్ డౌన్ విధిస్తారా....? లేదా....? అధికారికంగా స్పష్టత రావాలంటే మాత్రం మరికొన్ని గంటలు ఎదురుచూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: