తెలంగాణ సర్కార్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. మంత్రి ఈటల రాజేందర్‌ కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలను గణనీయంగా పెంచినట్లు తెలిపారు. అవసరమున్న ప్రతి వ్యక్తికి పరీక్షలు చేస్తామని అన్నారు. 11 కేంద్రాల్లో అనుమానితుల నమూనాలు సేకరిస్తున్నామని కరోనా పరీక్షల కోసం వచ్చేవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచిస్తున్నారు. ప్రజలు తప్పక మాస్క్‌ ధరించాలని, భౌతికదూరం పాటించాలని, లేదంటే అవే కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. 
 
వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా సోకినా తక్కువ లక్షణాలుంటే ఇంట్లోనే ఐసోలేషన్‌ కావాలని ఉదయం, సాయంత్రం విధిగా కాల్‌ సెంటర్‌ నుండి ఫోన్‌చేసి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీయాలని సూచనలు చేశారు. అవసరం ఉన్న వారి దగ్గరకు డాక్టర్లను పంపించాలని.... చికిత్సకు వచ్చిన ప్రతి పేషంట్‌ దగ్గరికి డాక్టర్, నర్స్‌ తప్పకుండా రోజుకి మూడుసార్లు వెళ్లి పరీక్ష చేయాలని వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలని చెప్పారు. 
 
అన్ని జిల్లాల్లో ఉన్న మెడికల్‌ కాలేజీలలో కరోనా రోగులను చేర్చుకోవాలని సూచనలు చేశారు. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌), గాంధీ ఆస్పత్రుల్లో ఎంతమంది సిబ్బంది అవసరమో గుర్తించి గురించి అందుకు తగిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని ఆస్పత్రుల్లో అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని చెప్పారు. 
 
సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని... జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతున్నందున డోర్‌ టూ డోర్‌ ఫీవర్‌ సర్వే ఫ్రీక్వెన్సీ పెంచాలని... వైరస్ ను ఎంత వేగంగా గుర్తిస్తే అంత వేగంగా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిన్నటినుంచి మరలా ప్రారంభం అయ్యాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 11 కేంద్రాల్లో నమూనాలు సేకరించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: