ఎంపీ గల్లా జయదేవ్‌ కుటుంబానికి చెందిన అమరరాజా ఇన్‌ఫ్రాటెక్‌ (ప్రైవేట్‌) సంస్థకు వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో కేటాయించిన 253.6 ఎకరాల్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ఏపీఐఐసీకి అనుమతిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్‌ ప్రభుత్వ హయాంలో (2009) చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం, యాదమర్రి మండలాల్లోని నూనెగుండ్లపల్లి, 108-మహారాజా కొత్తపల్లి గ్రామాల పరిధిలో అమరరాజా కంపెనీకి మొత్తం 483.27 ఎకరాలను ఏపీఐఐసీ కేటాయించింది.

 

 

'ఆ సంస్థ (అమరరాజా ఇన్‌ఫ్రాటెక్‌) భూములు తీసుకుని పదేళ్లవుతున్నా... ఒప్పందం ప్రకారం మొత్తం భూమిని వినియోగంలోకి తీసుకు రాలేదు. 253.6 ఎకరాలు ఖాళీగా ఉంచేసింది. ఆ భూముల్లో ప్రత్యేక ఆర్థిక మండలి(ఎస్‌ఈజెడ్‌)ని ఏర్పాటు చేస్తామని, డిజిటల్‌ వరల్డ్‌ సిటీని అభివృద్ధి చేస్తామని చెప్పింది. రూ.2,100 కోట్ల పెట్టుబడులు పెడతామని, 20 వేల మందికి ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు. 4,310 మందికి మాత్రమే ఉపాధి కల్పించింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న భూమి విలువ రూ.60 కోట్లకుపైగా ఉంటుంది. ఆ సంస్థ అంత విలువైన ప్రజల ఆస్తిని ఖాళీగా వదిలేయడం ఒప్పందంలో చేసుకున్న నిబంధనల్ని ఉల్లంఘించడమే కాకుండా, ప్రజా ప్రయోజనాలకూ విరుద్ధం. నిబంధనల ప్రకారం కంపెనీ ఏ అవసరం కోసం తీసుకుంటే అందుకు రెండేళ్లలోగా ఆ భూముల్ని వినియోగించాలి. లేనిపక్షంలో ప్రభుత్వం భూములు వెనక్కు తీసుకోవచ్చు' అని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్‌ వలెవన్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 

 

అమరరాజా సంస్థ గ్రామీణ ప్రాంతాల్లోనే పరిశ్రమలను ఏర్పాటు చేయడంతో పాటు పల్లె ప్రాంతాల యువతకు ప్రత్యక్షంగా 16వేల మందికి, పరోక్షంగా మరో 10వేల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. అమరరాజా సంస్థకు గతంలో చేసిన భూకేటాయింపుల్ని ఈ ప్రభుత్వం రద్దు చేయడం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ జయదేవ్‌పై అక్కసుతోనే భూముల్ని ప్రభుత్వం వెనక్కు తీసుకుంటోందని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: