హైద‌రాబాద్‌లో ఊహించ‌ని మార్పు. గ‌తంలో న‌గ‌రంలో కిక్కిరిసిన రోడ్లు...ఇప్పుడు శివార్ల‌లో కిక్కిరిసిపోతున్నాయి. వేలాది మంది సొంత వాహనాలు, అద్దె వాహనాలు, బస్సులు, మోటార్ సైకిళ్ళు, ఆటోలు.. కాదేదీ ప్రయాణానికి అనర్హం అన్నట్లుగా దొరికిన వాహనాన్ని పట్టుకుని సొంతూళ్లకు పరుగులు పెడుతుండడంతో టోల్‌ప్లాజాల వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో.. రద్దీని నివారించడం అధికారులకు శక్తికి మించిన పనిగా మారింది. ఇదంతా ఎందుకో తెలుసా?  మ‌ళ్లీ హైద‌రాబాద్‌లో లాక్ డౌన్ విధించ‌‌నున్నార‌నే సంకేతాలు, ప్ర‌చారం నేప‌థ్యంలో!

 


గ్రేటర్‌ హైదరాబాద్‌లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో 15 రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించే విషయంపై తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయం తెలిసిందే. ఒక్క సంకేతం నిర్ణయంగా మారక మునుపే... లాక్‌డౌన్‌ అనుభవాలతో ప్రజలు అప్రమత్తం అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా రోజురోజుకూ విస్తృతం అవుతున్న నేపథ్యంలో.. లాక్‌డౌన్‌ ఆలోచన ఉందని చెప్పగానే ఇపుడు రాజధాని భాగ్యనగర జనం పరుగులు పెడుతున్నారు. ప్రధానంగా ఆంధ్రాజనం రోడ్డెక్కారు. అద్దె ఇళ్ళలో ఉన్నవారు... లాక్‌డౌన్‌తో బతుకుదెరువులేని వారు.. విద్యార్ధులు, నిరుద్యోగులు, వ్యాపారులు అందరూ తమ స్వగ్రామాలకు వెళ్ళేందుకు పరుగులు పెడుతున్నారు. పదిహేనురోజులో.. నెలరోజులో ఇపుడు లాక్‌డౌన్‌ మొదలైతే ఎపుడు ఆగుతుందో చెప్పలేం. లాక్‌డౌన్‌ 1.0గా మొదలై 5.0దాకా పెరుగుతూ వెళ్ళిన అనుభవాలను చూసిన ప్రజలు ఇపుడు మళ్లీ లాక్‌డౌన్‌ అనేసరికి.. అయ్యబాబోయ్‌ అనుకుంటూ ఛలో.. సొంతూరు అనేస్తున్నారు. ఉన్నా..లేకున్నా, తిన్నా.. తినకున్నా సొంతూళ్లో అయిన వాళ్ల మధ్య ఉండాలని ఒక్కసారిగా ప‌రుగుపెడుతున్నారు.

 


తెలంగాణాలో మరోసారి లాక్‌డౌన్‌ ఉంటుందనే ప్రచారం జరుగుతుండంతో ఏపీ వాసులు తమ సొంత గ్రామాలకు బయలుదేరుతున్నారు. దీంతో మంగళవారం రాత్రి విజయవాడ హైవేపై వాహనాలు బారులుదీరాయి. నిబంధనలకు అనుగుణంగా ఏపీలోకి అనుమతిస్తామని చెప్పడంతో సరిహద్దులో గందరగోళం నెలకొంది. అయ్యింది. ఇక ఆంధ్రాలో సాయంత్రం 7గంటల వరకే వాహనాలకు అనుమతి ఉండడంతో అధికారులు వాహనాలను నిలిపివేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: