మంత్రి పదవుల భర్తీ అనేది ఎప్పుడూ అధికార పార్టీకి కత్తి మీద సాములాగే ఉంటుంది. ఎవరికి మంత్రి పదవులు అప్పగించినా, వారికి తీవ్ర అసంతృప్తి ఉంటుంది. తాము పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని, అయినా మాకు కాకుండా వెనక వచ్చిన వారికి పార్టీ పదవులు, మంత్రి పదవులు అప్పగించి తమను పక్కన పెట్టేశారు అనే అసంతృప్తి ప్రతి ప్రభుత్వానికి మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఎదురయ్యే ప్రధాన సమస్య. దానికి తాము అతీతం కాదు అని ఇప్పుడు వైసీపీ కూడా నిరూపిస్తోంది. మొదటి విడత మంత్రివర్గ విస్తరణ లోనే పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చాలామంది తమకు మంత్రి పదవి దక్కుతుంది అనే ఆశలు పెట్టుకున్నారు. జగన్ కు అత్యంత సన్నిహితంగా మెలుగుతూ, పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఎన్నో త్యాగాలు చేసి, ఆయన వెంట నడిచిన వారంతా తమకే అవకాశం దక్కుతుందనే ఆశలు పెట్టుకోగా, జగన్ మాత్రం అనూహ్యంగా సామాజిక సమీకరణాల లెక్కలు బయటకు తీసి, ఎవరూ ఊహించని వారికి మంత్రి పదవులు కట్టబెట్టారు.

 

IHG

 దీంతో కాస్త అసంతృప్తి చెలరేగిన రెండో విడత మంత్రివర్గ విస్తరణలో తప్పకుండా తమకు అవకాశం దక్కుతుందని జగన్ వీరవిధేయులంతా ఆశలు పెట్టుకున్నారు. ఎప్పటి నుంచో మంత్రివర్గ విస్తరణ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఇప్పుడు ఆ క్షణం రానే వచ్చింది అనే విధంగా వైసీపీలో పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన ప్రస్తుత మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇద్దరూ  త్వరలోనే రాజీనామా చేయబోతుండటం, ఆ రెండు పదవులతో పాటు, మరికొంతమంది పనితీరు సక్రమంగా లేని వారిని తప్పించి మరికొంత మందిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని జగన్ చూస్తుండటంతో, పార్టీ సీనియర్లంతా ఆశలు పెట్టుకున్నారు. 


జగన్ కు అత్యంత సన్నిహితులు, మంత్రి పదవులు ఆశిస్తున్నవారి లిస్ట్ చూస్తే, గుంటూరు జిల్లా మాచర్ల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఇప్పటికి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. అలాగే ప్రస్తుతం విప్ గా కూడా ఉన్నారు. జగన్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందనే ఆశలు పెట్టుకున్నారు. అలాగే మంగళగిరి నుంచి పోటీ చేసి నారా లోకేష్ పై విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. గతంలో ఎన్నికల ప్రచారంలో జగన్ రామకృష్ణా రెడ్డి కి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అలాగే చిలకలూరిపేట కు చెందిన కీలక నాయకుడు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ ను కూడా జగన్ మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు.


 2019 ఎన్నికలకు ముందు వరకు ఆయన పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డారు. కానీ విడుదల రజిని కి ఆ సీటు జగన్ కేటాయించడంతో ఆయన కు మంత్రి పదవి ఇస్తానని చెప్పి జగన్ బుజ్జగించారు. ఇక మొదటి నుంచి వైసీపీకి వెన్నుదన్నుగా ఉంటూ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ విరుచుకు పడే, జగన్ కు అత్యంత సన్నిహితుడైన అంబటి రాంబాబు కూడా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను ఓడించారు. ఆయన కూడా మంత్రి పదవిపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అలాగే చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా కూడా ఈసారి మంత్రివర్గ విస్తరణలో తనకే జగన్ అవకాశం ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. 


ఇలా చెప్పుకుంటూ వెళితే వైసీపీలో జగన్ కు విధేయులైన చాలామంది మంత్రి పదవిపై ఆశలు పెట్టుకును ఎదురుచూపులు చూస్తున్నారు. ఇప్పుడు కొంతమందికైనా జగన్ అవకాశం ఇస్తారా ? లేక మళ్లీ సామాజికవర్గాల లెక్కలు బయటకు తీసి వీరందరిని పక్కన పెడతారా అనే ఉత్కంఠ కలిగిస్తోంది. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: