ఫేస్‌బుక్‌ను బహిష్కరించే ఉద్యమం ఊపందుకుంది. లాభాల కోసం  విద్వేష పూరిత ప్రకటనలు కూడా అనుమతిస్తున్నారని ఆరోపిస్తూ... అనేక సంస్థలు ఫేస్‌బుక్‌కు అడ్వర్టైజ్ ‌మెంట్స్‌ను నిలిపివేశాయి. స్టాప్‌ హేట్‌ ఫర్‌ ప్రాఫిట్ పేరుతో ఫేస్‌బుక్‌కి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే నడుస్తోంది.

 

ప్రపంచ మల్టీ నేషనల్ కంపెనీల ఆగ్రహం ఫేస్‌బుక్ ను కుదేలు చేస్తోంది. విద్వేష పూరిత, తప్పుడు పోస్టులపై నిర్లక్ష్యం వహిస్తోందంటూ ఫేస్‌బుక్‌ను బహిష్కరించే ఉద్యమం ఊపందుకొంది. 'స్టాప్‌ హేట్‌ ఫర్‌ ప్రాఫిట్‌' పేరిట చేపట్టిన ఈ ఉద్యమంలో అనేక పెద్ద కంపెనీలు భాగస్వామ్యమవుతున్నాయి. ఫేస్‌బుక్‌కు యాడ్స్‌ ఇవ్వబోమని ప్రతినబూనుతున్నాయి. దీంతో ఫేస్‌బుక్‌ ఆదాయం గణనీయంగా పడిపోతోంది. ఫేస్‌ బుక్‌ కంపెనీ షేర్లు 8.3 శాతం పడిపోయాయి‌. ఫేస్‌బుక్‌ అధినేత జుకర్‌బర్గ్‌ 54 వేల కోట్ల వ్యక్తిగత ఆస్తులు కోల్పోయారు.

 

స్టాప్‌ హేట్‌ ఫర్‌ ప్రాఫిట్‌ పేరుతో జరుగుతున్న సామాజిక ఉద్యమం నేరుగా ఫేస్ బుక్ పై పడింది. అమెరికాకు చెందిన 160కి పైగా దిగ్గజ సంస్థలు ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇవ్వటాన్ని బహిష్కరించాయి. యూనిలివర్, వెరిజాన్‌ కమ్యుూనికేషన్స్, కోకోకోలా, హోండా అమెరికా, లెవిస్టాస్‌ వంటి సంస్థలను ప్రకటనల విషయంలో ఫేస్‌బుక్‌ను బ్యాన్ చేశాయి.. యూనిలివర్ సంస్థ ప్రకటనలు నిలిపివేయడం ద్వారా ఫేస్‌బుక్‌ సంస్థ సుమారు 1900 కోట్ల రూపాయలను నష్టపోయింది.

 

వివిధ సంస్థలు ఇచ్చే ప్రకటనల ద్వారా ఫేస్ బుక్ ప్రతి యేటా సుమారు 5.29లక్షల కోట్ల రూపాయల ఆదాయం పొందుతుంది. ఒక్కసారిగా వందలాది కంపెనీలు యాడ్స్‌ను నిలిపివేయడంతో ఫేస్‌బుక్ సంక్షోభంలో పడింది. షేర్లు దారుణంగా పడిపోవడంతో అధినేత జుకర్ బర్గ్ సంపద 82.3 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన స్థానం నాలుగో స్థానానికి చేరుకుంది.

 

అమెరికాకు చెందిన ఫ్రీ ప్రెస్‌, కామన్‌ సెన్స్‌.. మానవ హక్కుల సంస్థలతో కలసి స్టాప్‌ హేట్‌ ఫర్‌ ప్రాఫిట్‌ ఉద్యమాన్ని ప్రారంభించాయి. జాతి, వర్ణ, ప్రాంత వివక్షను ఇవి వ్యతిరేకిస్తున్నాయి. ఫేస్‌బుక్ లాంటి వంటి సామాజిక మాద్యమాలు మరింత పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ తరహా ప్రకటనలకు వ్యతిరేకంగా మరికొన్ని అమెరికా కంపెనీలతో పాటు యూరోపియన్ సంస్థలతో ఇవి చర్చలు జరుపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: