సరిహద్దుల్లో చైనా దొంగాట ఆడుతోంది.  చర్చల పేరుతో కాలక్షేపం చేస్తూ గుట్టుచప్పుడు కాకుండా తెరవెనుక కుతంత్రాలకు తెరతీస్తోంది. గాల్వాన్ లోయలో పట్టు కోసం రోజుకో ఎత్తుగడ వేస్తోంది. లడ్డాఖ్ బోర్డర్‌లో బలగాలను వెనక్కి తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు కనిపిస్తూనే... డ్రాగన్‌ తెలివి తేటలను ప్రదర్శిస్తోంది. వాస్తవాధీన రేఖ వద్ద తన ఇష్టానుసారం వ్యవహరిస్తోంది.  

 

చైనాను అంత ఈజీగా నమ్మడానికి వీలు లేదు. ఇతర దేశాల సరిహద్దులను ఆక్రమించుకోవడం అలవాటుగా మార్చుకున్న డ్రాగన్ కంట్రీ... ఆ దిశగా అడుగులు వేయడానికి ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధపడుతోంది. భారత్ సరిహద్దుల్లో లడక్‌ వద్ద యుద్ధ వాతావరణాన్ని సృష్టించి... జవాన్ల ప్రాణాలు తీసిన చైనా పాలకులు... పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఓవైపు చర్చలంటూనే... మరోవైపు యుద్ధానికి రెచ్చగొడుతోంది చైనా. లడ్డాఖ్ ను ఆక్రమించేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తోంది.   

 

ఇప్పటికే... గాల్వాన్ లోయను చైనా ఆక్రమించినట్లు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ తరుణంలో వారి వాదనలు బలం చేకూరేలా.. లడ్డాఖ్ లోని వివాదాస్పద భూమిపై చైనా... తన మ్యాప్ సింబల్ వెయ్యడమే కాదు... తాజాగా ప్యాంగాంగ్‌లో... వాస్తవాధీన రేఖ దగ్గర ఫింగర్-4, ఫింగర్ 5 ప్రాంతంలో... తన దేశ మ్యాప్‌ను ముద్రలా ఏర్పాటుచేసింది.  దీన్ని ఆకాశం నుంచి చూసినా కనిపించేంత పెద్దదిగా ఉంది.  81 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పుతో... మాండ్రిన్ భాషలో దీన్ని రూపొందించింది. శాటిలైట్ ఫొటోల్లో దీన్ని గుర్తించారు. తద్వారా... ఈ ప్రాంతం తమదే అని చెప్పుకునేందుకు  చైనా కుతంత్రాలు పన్నుతోంది.  

 

 ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతం చైనాది కాదు.  రెండు దేశాల మధ్య ఈ వివాదం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. ఫింగర్ 1 నుంచి ఫింగర్ 4 వరకు ఇండియా, ఫింగర్ 5 నుంచి ఫింగర్ 8 వరకు చైనా సైన్యం ఉంటుంది. ఫింగర్ 4ని రెండు దేశాల మధ్య సరిహద్దుగా భావిస్తున్నారు. ఐతే... ఇటీవల చైనా సైన్యం ఫింగర్ 4లోకి చొరబడింది. అక్కడి నుంచి వెళ్లిపోతామంటూనే వెళ్లకుండా తిష్టవేసింది. ఇప్పుడు అక్కడే తమ దేశ పటాన్ని వేసింది. తద్వారా... ఫింగర్ 4ను ఆక్రమించేందుకు యత్నిస్తోందనే సంకేతాలు వస్తున్నాయి.   


ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంలో... చైనా దాదాపు 8 కిలోమీటర్లు చొరబడిందనే ప్రచారం జరుగుతోంది. ఫింగర్ 4, ఫింగర్ 5 ప్రాంతంలో చైనా సైన్యం చాలా ఎక్కువ సంఖ్యలో ఉంది. అక్కడి నుంచి వెళ్లిపోతామని చెబుతూనే... వెళ్లకుండా అక్కడక్కడే తిరుగుతోంది. ప్రధాని మోదీ మాత్రం... చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి రాలేదనీ... ఎలాంటి ఆక్రమణా జరగలేదని చెబుతున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: