గ‌త కొద్దికాలంగా, ఏపీ రాజ‌కీయాల్లో జ‌రుగుతున్న ప్ర‌ధాన చ‌ర్చ‌ల్లో కీల‌క‌మైన అంశం.... ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి, ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అయిన రాజ్య‌స‌భ స‌భ్యుడు వై.విజ‌య‌సాయిరెడ్డికి మ‌ధ్య పొస‌గ‌డం లేద‌ని. ఇటీవ‌ల ఓ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తుండ‌గా ఏకంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న కారులో నుంచి విజ‌య‌సాయిరెడ్డిని కిందికి దించేయ‌డం దీనికి నిద‌ర్శ‌న‌మ‌ని, విజ‌య‌సాయిరెడ్డిని జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టేస్తున్నారు అనేందుకు ఇంత‌కంటే ఆధారాలు ఏం కావాల‌నే గుస‌గుస‌లు, ఓ వ‌ర్గం మీడియా ప్ర‌చారాలు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా దానికి బ్రేక్ ప‌డింది. ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు.

 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి తాజాగా కీల‌క పత్రికా ప్రకటన వెలువ‌డింది. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడానికి పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్మోహన్‌రెడ్డి కీల‌క‌ నిర్ణయాలు తీసుకున్నారని, ఇందులో భాగంగా జిల్లాల వారీగా పార్టీ బాధ్యతలను ముగ్గురు నేతలకు అప్పగించారనేది ఆ ప్ర‌క‌ట‌న సారాంశం. వైసీపీ అధినేత జ‌గ‌న్ నిర్ణయాల ప్రకారం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలను,  పార్టీ ముఖ్య‌నేత‌ సజ్జల రామకృష్ణారెడ్డి కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారని వెల్ల‌డించింది. తాడేపల్లిలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయ సమన్వయ బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డి చూడాల్సిందిగా పార్టీ అధ్యక్షులు నిర్ణయించారని ప్ర‌క‌ట‌న పేర్కొంది.

 


కాగా, గ‌త కొద్దికాలంగా విజ‌య‌సాయిరెడ్డి ప్రాధాన్యత‌ను సీఎం జ‌గ‌న్ త‌గ్గిస్తున్నార‌నే ప్ర‌చారానికి ఈ నిర్ణ‌యం చెక్ పెట్టింద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇదే స‌మ‌యంలో కీల‌క‌మైన‌ రాజ‌ధాని త‌ర‌లింపు, ప‌రిపాల‌న రాజ‌ధాని కొలువుదీరిన ప్రాంతాన్ని విజ‌య‌సాయిరెడ్డికి క‌ట్ట‌బెట్ట‌డం గ‌మ‌నార్హం. కాగా, నేడు విజ‌య‌సాయిరెడ్డి పుట్టిన రోజు. ఆయ‌న పుట్టిన‌రోజునే జ‌గ‌న్ ఈ తీపిక‌బురు ఇవ్వ‌డం ఖ‌చ్చితంగా విజ‌యసాయిరెడ్డికి బ‌ర్త్‌డే గిఫ్ట్ వంటిద‌ని విశ్లేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: