ఏపీకి ప్రత్యేక హోదా అన్నది జీవనాడి జీవనాడి అని వైసీపీ గత ఎన్నికల్లో ప్రచారం చేసింది. పాతిక ఎంపీ సీట్లు ఇస్తే చాలు కేంద్రం మెడలు వంచి తీసుకువస్తామని కూడా చెప్పింది. ఇక ప్రత్యేక హోదాతోనే ఏపీలోని ప్రతీ జిల్లా హైదరాబాద్ ని చేస్తామని స్వయంగా జగన్ చెప్పుకొచ్చారు. తీరా ప్రజలు వైసీపీని నమ్మి 22 ఎంపీ సీట్లు ఇచ్చారు. వాటిని తీసుకున్న తరువాత అధికారంలోకి వచ్చాక జగన్ తొలి  మాటగా చెప్పేశారు. ఈ ప్రభుత్వం లో హోదా సాధించలేమని.

 

కేంద్రంలోని బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది. వారికి మన అవసరం లేదని, అందువల్ల హోదా అన్నది వారిని మంచి చేసుకుని పొందాల్సిందేనని  చెప్పేశారు. సరే ఏడాదిగా వైసీపీ కేంద్రాన్ని అడుగుతోంది. స్మూత్ గానే అది అడుగుతోంది. హోదా అన్నది బీజేపీ ద్రుష్టిలో ముగిసిన అధ్యాయం. అయితే వైసీపీకి మాత్రం చాలా హోప్స్ ఉన్నాయని జగన్ ఈ మధ్య జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో చెప్పుకొచ్చారు.

 

ఇవాళ రాకపోయినా రేపు అయినా హోదా తెస్తామన్న నమ్మకం మాకు ఉంది అని జగన్ అన్నారు. సరే జగన్ ఆశలు అలా ఉంటే ఉన్నాయి. జనం కూడా ఇంకా ఆశతోనే ఉన్నారు. కానీ  ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే వైసీపీకి చెందిన ఎంపీగారే హోదా రాదు అని సెలవియ్యడం. ఆయన ఎవరో కాదు, కొత్తగా రాజ్యసభ సభ్యునిగా బాధ్యతలు స్వీకరించబోతున్న పిల్లి సుభాస్ చంద్రబోస్. ఆయన రాజ్యసభ సభ్యునిగా పెద్దల సభలో మాట్లాడనున్నారు. ఆయన ఏపీకి సంబంధించిన అన్ని అంశాలు కూడా చర్చకు పెట్టనున్నారు.

 

మరి అటువంటి పిల్లి ఇలా హోదా మీద నీళ్ళు చల్లడం అంటే బాధాకరమే. ఈ విషయంలో పిల్లి మాటలు జగన్ ఆశలకు, ఆశయాలకు కూడా పూర్తి విరుధ్ధంగా ఉన్నాయని అంటున్నారు. పిల్లి మరి ఎందుకు ఇలా చెప్పారో కానీ వైసీపీకి అసలైన ఆయుధమైన, ఆ పార్టీని అధికారంలోకి తెచ్చిన హోదా మీదనే ఇలా చెప్పడం మాత్రం చర్చ అవుతోంది. చివరలో ఇది తన వ్యక్తిగత  అభిప్రాయం అని అన్నారు కూడా. ఏది ఏమైనా పిల్లి జోస్యం  మాత్రం శుభమాని పెద్దల సభకు వెళ్తూ చెప్పిన చేదు వార్తగానే ఉందిపుడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: