గోవా...భార‌త‌దేశంలోని అత్యంత సుంద‌ర‌మైన ప‌ర్యాట‌క ప్రాంతాలు ఉన్న రాష్ట్రం. ప‌ర్యాట‌క‌మే పెద్ద ఆదాయంగా ఉన్న ఈ రాష్ట్రం క‌రోనాతో విల‌విల్లాడుతోంది. ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌కుండా ఉండేందుకు ప‌లువురు గోవా వైపు క‌న్నెత్తి చూడ‌టం లేదు. ఇక ప్ర‌భుత్వ అనుమ‌తులు స‌రే సరి. ఇలాంటి త‌రుణంలో....గురువారం నుంచి నుంచి గోవాకు పర్యాటకులను అనుమతిస్తున్నట్లు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మనోహర్‌ అజ్గావ్కర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, ఆయ‌న ప‌లు ముఖ్య‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. 

 


మహారాష్ట్ర లాంటి అతి పెద్ద‌ రాష్ట్రాలు, హైదరాబాద్ ‌లాంటి నగరాల్లో కార్య‌క‌లాపాలు య‌థావిధిగా సాగుతున్న నేపథ్యంలో పర్యాటకరంగంలో గోవా వెనుకబడకూడదనే ఉద్దేశంతోనే టూరిస్టులను రాష్ట్రంలోకి అనుమతిస్తున్నామని మంత్రి అజ్గావ్కర్‌ స్పష్టం చేశారు. 250 హోటళ్లు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించుకునేలా ఉత్తర్వులు ఇచ్చామని ఆయన వెల్లడించారు. పర్యాటక శాఖలో నమోదు చేసుకున్న హోటళ్లలో మాత్రమే బుకింగ్‌లు  అనుమతి ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకూ 250 హోటళ్లు మాత్రమే రిజిస్టర్‌ చేసుకున్నాయని, వాటిలో ఆతిథ్య సేవలందించేందుకు అనుమతులు జారీ చేశామని మంత్రి వివ‌రించారు.  ప్ర‌భుత్వం వ‌ద్ద వివ‌రాలు నమోదు చేసుకోని హోటళ్లు, వసతి గృహాల్లో పర్యాటకులు ఉంటే చట్టవిరుద్ధంగా పరిగణిస్తామని మంత్రి అజ్గావ్కర్ తేల్చి చెప్పారు.

 

దీంతో పాటుగా క‌రోనా మ‌హ‌మ్మారి విష‌యంలో మంత్రి అజ్గావ్కర్ ప‌లు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోకి ప్రవేశించిన పర్యాటకులు 48 గంటల్లోగా కొవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ పొందాలని మంత్రి సూచించారు. ఇక్కడ కొవిడ్‌ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిందేనని ఆయ‌న అన్నారు. ఎంట్రీ పాయింట్ల వద్ద తప్పనిసరిగా చెకింగ్‌ పాయింట్లు పెట్టి తనిఖీ చేస్తామని, సర్టిఫికెట్ ‌లేని పర్యాటకులను తిరిగి వారు బుక్‌ చేసుకున్న హోటల్‌కు పంపిస్తామని మంత్రి అజ్గావ్కర్ వెల్ల‌డించారు. అక్కడ పరీక్షలు నిర్వహిస్తారని, నెగెటివ్‌ వచ్చినవారికే అనుమతి ఉంటుందని మంత్రి అజ్గావ్కర్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: