దేశవ్యాప్తంగా అన్ లాక్ 2.0 గైడ్ లైన్స్ అమల్లోకి వచ్చాయి. దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేతలో భాగంగా.. సడలింపులను మరింతగా పెంచింది కేంద్రం. ఇక ప్రయాణీకులకు, సరకు రవాణకు అనుమతులక్కర్లేదు. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం జూలై 31 వరకూ లాక్ డౌన్ కొనసాగనుంది.

 

లాక్ డౌన్ సిరీస్ ముగిసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ లాక్ సిరీస్ నడుస్తోంది. కేంద్రం ప్రకటించిన అన్ లాక్ 2.0.. అమల్లోకి వచ్చింది. నిబంధనలన్నీ కంటైన్‌మెంట్ జోన్లకే పరిమితం కానున్నాయి. ఇక ముందస్తు అనుమతులు.. ఈ-పర్మిట్ల అవసరం లేకుండా ప్రజలు ఏ రాష్ట్రంలోనైనా పర్యటించవచ్చు. సరుకు రవాణా వాహనాలు దేశంలో ఎక్కడైనా తిరగొచ్చు. అన్ లాక్ 2.0లో ముఖ్యంగా మూడు విషయాలను ప్రస్తావించారు. అందులో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన వాటికి మరిన్ని అనుమతులు కల్పిస్తూ పరిమితులు ఎత్తేశారు. రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాల్సినవి రెండో అంశం కాగా.. నిషేధం ఉన్నవి .. మూడో అంశం. 

 

ఇప్పటికే అనుమతించిన రైళ్లు.. విమాన సర్వీసుల్ని రానున్న రోజుల్లో క్రమపద్దతిలో మరింతగా విస్తరిస్తారు. జులై 15 నుంచి కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల శిక్షణ సంస్థల్ని తెరించేందుకు అనుమతించారు. కంటైన్‌మెంట్ల జోన్లకు బయట ఉండే ప్రార్థన మందిరాలు, హోటళ్లు, అతిథ్య సేవలు, షాపింగ్ మాళ్లు తెరిచేందుకు అవకాశం కల్పించారు. విదేశాల్లో నిలిచిపోయిన భారతీయుల తరలింపుతో పాటు.. సముద్ర రవాణాను పునరుద్దరించారు.

 

పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు తెరవడంపై.. జూలై 31 వరకూ నిషేధం ఉంటుంది. వీటితో పాటు కేంద్ర హోం శాఖ అనుమతి లేని అంతర్జాతీయ విమాన ప్రయాణాలు... మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, జిమ్ లు, స్విమ్మింగ్ ఫూల్స్, పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలపై నెలాఖరు వరకూ నిషేధం కొనసాగుతుంది. సామాజిక రాజకీయ.. క్రీడా, వినోద కార్యక్రమాలతో పాటు విద్య, రాజకీయ, మతపరమైన కార్యక్రమాలను అనుమతించరు.

 

పరిస్థితులను బట్టి రాష్ట్రాలు ...కంటైన్ మెంట్ కేంద్రాల ఏర్పాటుకు అవకాశముంది.రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదుగంటల వరకూ కర్ఫ్యూను యథాతధంగా అమలు చేస్తారు. అయితే.. కర్ఫ్యూ వేళలో సరకు రవాణాతో పాటు, విమానాలు, బస్సులు, రైలు ప్రయాణీకులు.. తమ గమ్యస్థానాలకు చేరేందుకు ఎలాంటి ఆంక్షలు ఉండవు.

మరింత సమాచారం తెలుసుకోండి: