దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే వరుసగా రెండోరోజు కేసులు తగ్గాయి. కానీ మరణాలు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు కరోనా హాట్ స్పాట్‌లుగా మారాయి. మరోవైపు కోవిడ్ వైరస్ ఇంకా పతాకస్థాయికి చేరలేదని.. ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే లక్షల ప్రాణాలు పోయే ప్రమాదముందని డబ్ల్యూహెచ్ ఓ హెచ్చరించింది. 

 

దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసుల సంఖ్య తగ్గింది. సోమవారం 19 వేల 459 మందికి కొవిడ్‌ సోకగా, నిన్న 18,522 మందికి పాజిటివ్‌గా తేలిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.  ముందురోజుతో పోలిస్తే బాధితుల సంఖ్య 937 తగ్గింది. మంగళవారం 418 మంది మృతి చెందారు. మరణాలు సోమవారం కంటే 38 ఎక్కువగా నమోదయ్యాయి. ఈ రోజు 18 వేల 563 కేసులు నమోదు కాగా.. 507 మంది చనిపోయారు. మొత్తం కేసులు 5లక్షల 85 వేల 493కి చేరగా.. ఇందులో యాక్టివ్ కేసులు 2 లక్షల 20 వేల 114 ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కోలుకున్నవారు 3లక్షల 47 వేల 979 మంది కాగా.. 17 వేల 400 మంది మృతి చెందారు.

 

వైరస్‌తో దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక అల్లాడుతున్నాయి. ప్రధానంగా తమిళనాడులో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కేసుల్లో ఢిల్లీని వెనక్కు నెట్టేసి రెండోస్థానంలోకి దూసుకెళ్లింది. తమిళనాడులో 90వేల కేసులుండగా.. ఢిల్లీలో 87 వేల మంది వైరస్ బాధితులున్నారు. కర్ణాటక.. హర్యానా, ఏపీలను దాటేసింది. దేశంలో కరోనా హాట్‌స్పాట్‌ మహారాష్ట్రలో మరోసారి 5 వేలపైగా కేసులు వచ్చాయి.

 

కరోనా కేసుల ఉధృతిని అదుపుచేయగలిగామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. జూన్ 30 నాటికి ఢిల్లీలో లక్ష కోవిడ్ కేసులు, 60,000 యాక్టివ్ కేసులుండగా.. ఇవాళ 26,000 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయన్నారు. మరోవైపు కేంద్ర మాజీమంత్రి బేణీ ప్రసాద్ వర్మ కుమారుడు దినేష్.. కరోనాతో లక్నోలో చికిత్స పొందుతూ మరణించారు. 

 

ఇంకా కరోనా పతాక స్థాయికి చేరలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కొవిడ్‌-19పై ప్రభుత్వాలు తగిన విధానాలను అవలంబించకపోతే... వైరస్‌ లక్షలాది మందికి వ్యాపించే ప్రమాదముందని డబ్ల్యూహెచ్ ఓ చీఫ్‌ టెడ్రస్‌ అథనోమ్‌ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: