దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అన్ లాక్ 2.0 సడలింపులతో దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను నియంత్రించటం సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంయుక్త డ్రగ్స్‌ కంట్రోలర్‌ (ఇండియా) డాక్టర్‌ ఎస్‌.ఈశ్వర్‌ రెడ్డి కరోనాను నియంత్రించే తొలి టీకా భారత్ నుంచి రానుందని తెలిపారు. 
 
హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌కు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ అనుమతులు ఇచ్చిన విషయాన్ని ఆయన ధృవీకరించారు. పరిశోధనలు మంచి ఫలితాలు ఇస్తే మరో మూడు నెలల్లో ఆ వ్యాక్సిన్‌ మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వ్యాక్సిన్ ను జంతువులపై ప్రయోగించినప్పుడు సానుకూల ఫలితాలు వచ్చాయని... అందువల్లే మానవ పరిశోధనలకు అనుమతులు ఇచ్చినట్టు చెప్పారు. 
 
సాధారణంగా వ్యాక్సిన్‌ అభివృద్ధికి కనీసం ఆరేళ్లు పడుతుందని కానీ ప్రయోగాలు జరిపి 3 నెలల్లోనే వ్యాక్సిన్‌ను మానవ పరీక్షలకు సిద్ధం చేశామని అన్నారు. భారత్‌లోనే వ్యాక్సిన్‌ మొదట లభ్యమయ్యే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ వేరు చేసిన కరోనా స్ట్రెయిన్‌తో, హైదరాబాద్‌లోని జీనోమ్‌వ్యాలీలో వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసినట్టు చెప్పారు.   
 
ఈనెలలో కొందరు స్వచ్ఛంద కార్యకర్తలకు టీకా ఇవ్వబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు. ప్రధాని మోదీ నిన్న ఈ టీకా గురించి సమీక్ష నిర్వహించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వేగంగా టీకాలు ఇవ్వడానికి రూపొందించాల్సిన ప్రణాళికల గురించి చర్చించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో సమీక్షించాల్సిందిగా అధికారులను మోదీ ఆదేశించారు.                                        
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: