భారత్‌లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 18,653 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 507 మంది మరణించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 6 లక్షలను దాటగా, మొత్తం కేసుల సంఖ్యలో మూడో స్థానంలో ఉన్న రష్యాకన్నా 50 వేల కేసులు మాత్రమే తక్కువగా ఉన్నాయి. భారత్ లో రోజుకు దాదాపు 20 వేల కేసులు వస్తున్నవేళ, మరో నాలుగైదు రోజుల్లోనే ప్రపంచంలో కరోనా కేసుల్లో మూడో స్థానానికి ఇండియా చేరడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి స్థానంలో అమెరికా 26 లక్షలకు పైగా కేసులతో ఉండగా, రెండో స్థానంలో బ్రెజిల్ 14 లక్షల కేసులతో కొనసాగుతున్నాయి. 

 

దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 5,85,493కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 17,400కి పెరిగింది. 2,20,114 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,47,979 మంది కోలుకున్నారు. ఈ మహమ్మారి భారత జవాన్లను కూడా వదలడం లేదు. ఇప్పటికే సినీ,రాజకీయ ప్రముఖులకు సోకుతున్న  వైరస్ ప్రస్తుతం బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్‌లలోని సిబ్బందికి తలనొప్పిగా మారింది. వరుసగా చాలా మంది సైనికులు వ్యాధిబారిన పడుతున్నారు. దీంతో నిత్యం  గస్తీ కాసే బృందాలకు ఇది తలనొప్పిగా మారింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు తగిన చర్యలు ప్రారంభించారు.   

 

గత కొన్ని రోజులుగా పోలీసులను, డాక్టర్లను పట్టి పీడిస్తుంది కరోనా.  ఇక దేశాన్ని రక్షించే సీఆర్‌పీఎఫ్‌లో 1,219 మంది, బీఎస్ఎఫ్‌లో 1,018 మందికి పాజిటివ్ వచ్చిందని కేంద్ర హోంశాఖ అధికారులు చెప్పారు.  దీంతో వారందరికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అన్నారు. ముందు జాగ్రత్త చర్యగా అనుమానిత లక్షణాలు ఉన్నవారిని వెంటనే క్వారంటైన్ చేసి పరీక్షలు చేస్తున్నామని చెప్పారు.  ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ముందు ముందు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: