నేపాల్‌లో అసమ్మ‌తి తార స్థాయికి చేరుకుంది. చైనా అండ చూసుకుని భార‌త్‌తో క‌య్యానికి కాలు దువ్వుతున్న నేపాల్ ప్ర‌ధాని కేపీ ఓలీ శర్మ రాజీనామా చేయాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.  అధికార పక్షమైన కమ్యునిస్టు పార్టీ నుంచి ముఖ్య నేత పుష్ప కమల్ దహల్ కూడా ప్రధాని తన పదవిని త్యజించాలని కోరడం నేపాల్ రాజకీయాలలో పెను సంచలనానికి దారితీసింది. దేశానికి సంబంధించిన ప‌లు కీల‌క నిర్ణ‌యాల్లో ఓలీ వివాదాస్ప‌దంగా వ్య‌వ‌హ‌రించాడ‌ని, స‌రైన నిర్ణ‌యాన్ని తీసుకోలేక‌పోయార‌ని దుయ్య‌బ‌ట్ట‌డం విశేషం. ఓలీని రాజీనామా చేయాల‌ని ప‌ట్టుబ‌డుతున్న ముఖ్య‌నేత‌ల్లో  పుష్ఫ కమల్ దహల్, మాధవ్ కుమార్ నేపాల్, జలనాథ్ ఖనల్ వంటి వారు ఉన్నారు. 

 

తనను పదవి నుంచి తొలగించేందుకు భారత్‌ కుట్ర చేస్తోందని, కొంతమంది నేపాల్‌ నాయకులు సైతం ఈ కుట్రలో భాగస్వాములు అయ్యారని రెండు రోజుల క్రిత నేపాల్  ప్రధాని ఓలీ ఆరోపించారు. ఈ విషయంపై తేల్చుకునేందుకు నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం బలువతార్‌లోని ప్రధానమంత్రి నివాసంలో జరిగింది. దీనికి అధికార పార్టీ సభ్యులతో పాటు మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ సైతం హాజరయ్యారు.రెండు రోజుల క్రితం జ‌రిగిన పార్టీ స‌మావేశంలో మొత్తం 18 మంది నాయకులు హాజరవగా 17 మంది రాజీనామాకు పట్టుబట్టారు. అంతేకాకుండా.. పార్టీ పగ్గాలను కూడా ఇతరులకు అప్పగించాలని ఓలీ శర్మకు  సూచించ‌డం గ‌మ‌నార్హం.

 

 తాజాగా రెండు రోజుల నుంచి ప్ర‌ధానికి అత్యంత స‌న్నిహితుల వారు రంగంలోకి దిగి ఏదో ప‌రిస్థితిని మార్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నా..సెట్ కాలేదు. ఇదిలా ఉండ‌గా తనను అధికారంలోంచి త‌ప్పించాల‌ని భార‌త్ నుంచి కొంత‌మంది నేత‌లు కుట్ర ప‌న్నుతున్నారంటూ మొస‌లి క‌న్నీరు కార్చి మ‌ద్ద‌తు పొందాల‌నుకోవ‌డం బెడిసి కొట్టింది. పార్టీ నేత‌ల‌కు ఇది మ‌రింత ఆగ్ర‌హం తెప్పించింది. ఓలీ ప్ర‌ధాని పీఠం నుంచి త‌ప్పుకోవ‌డం ఇక లాంఛ‌న‌మేన‌ని తెలుస్తోంది. ఓలీ శ‌ర్మ చేసిన ఆరోప‌ణ‌ల‌పై భార‌త దౌత్య కార్యాల‌యం తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. భార‌త్‌పై విమ‌ర్శ‌లు మానుకోవాల‌ని హిత‌వు ప‌లికింది. ప్రధాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, దౌత్యపరంగా సరైనవి కావన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: