తెలంగాణలో కరోనా వైరస్ క‌ల‌క‌లం కొన‌సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ‌ రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. మ‌రోవైపు రాజ‌ధాని హైద‌రాబాద్‌లో లాక్ డౌన్ ప్ర‌తిపాద‌న తెర‌మీద‌కు వ‌స్తోంది. ఇక విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం స‌మీపిస్తోంది. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో స్కూళ్లను తిరిగి ప్రారంభించడంపై అంద‌రి దృష్టి ప‌డింది. ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటంద‌నే ఉత్కంఠ అంద‌రిలో ఉంది. ఈ స‌మ‌యంలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింద‌. స‌ర్కారీ పాఠ‌శాల‌లు ప్రారంభించేందుకు ఎలాంటి నిర్ణయం ఇప్పటి వరకూ తీసుకోలేదని స్పష్టం చేసింది.

 

ఆన్‌లైన్ క్లాసులు, పాఠ‌శాల‌లు తిరిగి ప్రారంభించ‌డంపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిత్రా రామచంద్రన్ తాజాగా కీల‌క నిర్ణ‌యం వెలువ‌రించారు. పాఠ‌శాల‌లు ప్రారంభించే విషయంలో ఇంతవరకూ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాన్నీ ప్రకటించలేదని తెలిపారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేదని వివ‌రించారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూల్స్ తెరిచేందుకు ఎలాంటి అనుమతులూ లేవని స్పష్టం చేశారు.  నిబంధనలను అతిక్రమిస్తే, పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని ప్రొసీడింగ్స్ లో ఆమె స్పష్టం చేశారు.

 


ఇదే సమయంలో ఆన్ లైన్ తరగతుల నిర్వహణపైనా ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిత్రా రామచంద్రన్ తెలిపారు. కాగా, ఆన్‌లైన్‌ క్లాసెస్ నిర్వహిస్తూ టర్మ్‌ ఫీజు పేరుతో పలు ప్రైవేట్‌ విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల్ని దోచుకుంటున్నాయని, ఆన్‌లైన్‌ టీచింగ్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిల్‌ను చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ విజయన్ ‌రెడ్డిల డివిజన్‌ బెంచ్‌ బుధవారం విచారించింది. ఆన్‌లైన్‌ లో టీచింగ్ పై ఇప్పటి వరకు ఏమైనా నిర్ణ‌యం తీసుకున్నారా ? అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. లేదంటే దీనికి సంబంధించి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రతివాదులైన చీఫ్‌ సెక్రటరీ, పాఠశాల విద్యా శాఖ డైరెక్ట‌ర్, తెలంగాణ రిజిస్టర్‌ స్కూల్‌ మేనేజిమెంట్ అసోసియేషన్లు, హైదరాబాద్, రంగారెడ్డి డీఈవోలను ఆదేశించింది. ఆన్‌లైన్‌ లో టీచింగ్ పై సర్కార్ విధాన నిర్ణ‌యం ఏదైనా తెలుసుకుందో లేదో చెప్పాలని కోరింది. ఆన్‌లైన్‌ టీచింగ్ పేరుతో ఫీజులు వసూలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలంటూ డీఈవోలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ప్రభుత్వ ప్రత్యేక లాయర్ సంజీవ్‌కుమార్ ‌కోర్టుకు తెలిపారు. ఐతే రెం డు, మూడు జిల్లాలు మినహా అన్నిజిల్లాలో ఆన్ లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నారంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అసలు ప్రైవేట్ స్కూళ్ల‌లో ఆన్ లైన్ టీచింగ్ కు ప్రభుత్వం అనుమతించిందా లేదా కూడా చెప్పాలని కోర్టుకోరింది. పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కోరుతూ విచారణను 8వ తేదీకి వాయిదా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: