దేశంలో కరోనా ఏ విధంగా పెరిగిపోతుందో అందరికీ తెలిసిందే. దేశంలో కొవిడ్‌-19 కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 19,148 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 434 మంది కరోనా కారణంగా మరణించారు.మృతుల సంఖ్య మొత్తం 17,834కి పెరిగింది. 2,26,947 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,59,860 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 6,04,641కి చేరుకుంది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 1,80,298 కరోనా కేసులు నమోదుకాగా, ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 8,053 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో ఇప్పటివరకు 94,049 కరోనా కేసులు నమోదు కాగా, 1,264 మంది మృతి చెందారు.

 

ఢిల్లీలో  89,802 కరోనా కేసులు నమోదు కాగా,  2,803  మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కరోనా సమయంలో లాక్ డౌన్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి కొన్ని చోట్ల భారీ జరిమానాలే విధించారు. తాజాగా మాస్కులు ధరించనివారి నుంచి రూ.57.39 లక్షల జరిమానాను అధికారులు వసూలు చేశారు. కర్ణాటకలోని బెంగళూరులో ఒక్క నెలలోనే ఈ మొత్తం వసూలు కావడం విశేషం.

 

కరోనా నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోయినా, భౌతిక దూరాన్ని పాటించకపోయినా రూ.200 జరిమానాను బృహన్‌ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) వసూలు చేస్తున్నది. కాగా, జూన్‌ నెలలో అత్యధికంగా రూ.57.39 లక్షల జరిమానాను వసూలు చేసినట్లు బృహన్‌ బెంగళూరు నగర పాలక మండలి తెలిపింది. ఈ నిబంధన అమలులోకి వచ్చిన మొదట్లో తొలిసారి ఉల్లంఘించిన వారికి రూ. వెయ్యి, మరోసారి ఉల్లంఘిస్తే రూ.2 వేలు జరిమానా విధిస్తామని అధికారులు తెలిపారు. అయితే దీనిపై విమర్శలు రావడంతో మే 5న ఈ జరిమానాను రూ.200కు తగ్గించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: