కరోనా టైమ్ లో కూడా ఆంధ్రప్రదేశ్ లో అవినీతి జరుగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజలకు మేలు చేసే ఆలోచన లేదని, అంబులెన్సుల్లో కూడా అవినీతి చేశారని విరుచుకుపడ్డారు చంద్రబాబు. 

 

కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు మేలు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కరోనా అనేది ప్రపంచానికే పెద్ద సమస్యగా మారిందన్న చంద్రబాబు.. సమస్యను ఎలా ఎదుర్కొని ముందుకెళ్లాలో ఆలోచించుకోవాలని సూచించారు. ప్రజల జీవితాల్లో చాలా సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.

 

లాక్‌డౌన్‌ పెట్టిన తర్వాత ఏపీకి 8వేల కోట్లు ఇచ్చామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారని, ఆ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వాడలేదని చంద్రబాబు ఆరోపించారు. ప్రతి కుటుంబానికి కనీసం 5వేలు చొప్పున ఇవ్వాలని కోరినా స్పందించలేదని, కరోనా కిట్లు,  బ్లీచింగ్‌ కొనుగోలులో అవీనితికి పాల్పడ్డారని మండిపడ్డారు.

 

అంబులెన్సుల కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయన్నారు చంద్రబాబు. విజయసాయిరెడ్డికి పుట్టినరోజు కానుకగా 307 కోట్ల కాంట్రాక్ట్ ఆయన అల్లుడికి కట్టబెట్టారని విరుచుకుపడ్డారు. అనుభవం ఉన్న సంస్థను ఎందుకు పక్కనపెట్టారో చెప్పాలని నిలదీశారు. 

 

కరోనాకు సంబంధించి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి పబ్లిసిటీతో మనుగడ సాధించాలని చూస్తున్నారని విమర్శించారు చంద్రబాబు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తే తమపైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 

 

మొత్తానికి చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు ఎక్కుపెట్టారు. అంబులెన్సుల కొనుగోళ్లలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రజలకు అందాల్సిన అవసరాల్లో అవకతవకలు జరిగాయంటే ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మరి ఈ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: