దేశవ్యాప్తంగా బొగ్గుగని కార్మికుల మూడు రోజుల సమ్మె కొనసాగుతోంది.  బొగ్గు గనుల్లో వాణిజ్య మైనింగ్ కు అనుమతివ్వడాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. కేంద్రంతో కార్మిక సంఘాలు చర్చలు విఫలం కావడంతో.. సమ్మె సైరన్ మోగింది. వాణిజ్య మైనింగ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి నిరాకరించిన కేంద్రం.. కోల్ ఇండియాను ప్రైవేటీకరించే ప్రతిపాదన ఏమీ లేదని ప్రకటించింది. 

 

రోజూ 1.3 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియాలో కార్మిక సంఘాలు సమ్మె బాట పట్టాయి. బొగ్గు గనుల్లో వాణిజ్య మైనింగ్ కు అనుమతిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. 72 గంటల పాటు బంద్ కు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా అన్ని బొగ్గు గనుల్లో కార్మికులు ఫస్ట్ షిఫ్ట్ నుంచే సమ్మెకు దిగారు. కేంద్రం ఏకక్షంగా వ్యవహరిస్తోందని, వాణిజ్య మైనింగ్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమ్మెతో 4 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతుందని అంచనా. 

 

గతంలో బొగ్గు గనుల జాతీయకరణ తర్వాత.. 1973లోనే కొన్ని సవరణలు తెచ్చారని కార్మిక సంఘాలు గుర్తుచేశాయి. అప్పట్లో వేతనాలు, సర్వీస్ కండిషన్స్ పై కొన్ని రూల్స్ తెచ్చాయని.. వాటిని కూడా అప్పట్లో వ్యతిరేకించామని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ఇప్పుడు వాణిజ్య మైనింగ్ పేరుతో కేంద్రం పూర్తిగా ప్రైవేటుకు గేట్లు తెరిచిందని, దీంతో కార్మికుల జీవితాలు మరింత డేంజర్ జోన్ లో పడ్డాయని వాదిస్తున్నారు. ప్రైవేట్ సంస్థలు లాభాపేక్షతో కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. 

 

కోల్ ఇండియాతో పాటు తెలంగాణలో సింగరేణి కాలరీస్ లో కూడా సమ్మె జరుగుతోంది. అయితే జాతీయ కార్మిక సంఘాలు మూడు రోజుల సమ్మెకు పిలుపునివ్వగా.. సింగరేణిలో గుర్తింపు పొందిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మాత్రం 24 గంటల బంద్ కు పిలుపునిచ్చింది. బుధవారం రాత్రి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీతో కార్మిక సంఘాల చర్చలు ఫలించలేదు. వాణిజ్య మైనింగ్ విధాన నిర్ణయమని కేంద్ర మంత్రి తేల్చేయడంపై.. కార్మికసంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. 

 

కోల్ ఇండియాలో పెట్టుబడులు ఉపసంహరణ కానీ, ప్రైవేటీకరణ కానీ తమ అభిమతం కాదని కేంద్రం చెబుతున్నా.. కార్మిక సంఘాలు మాత్రం ప్రభుత్వ ఉద్దేశాన్ని అనుమానిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: