నగరం పల్లెబాట పట్టింది. సిటీలో మరోసారి లాక్ డౌన్ ఉంటుందన్న ప్రచారంతో... ఇక్కడ ఉండి అవస్థలు పడేకంటే సొంతూర్లో గంజి తాగి బతకొచ్చన్న ఆశతో సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. మూటముల్లె సర్దుకుని పిల్లాపాపలతో వెళ్తున్నారు. అంతా సర్దుకున్నాక ..నగరంలో ప్రశాంత వాతావరణం వచ్చాకే తిరిగి నగరానికి వస్తామంటున్నారు.

 

తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు టెన్షన్ పుట్టిస్తున్నాయి.  జూన్ నెలలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రమంతటా ఒక ఎత్తు అయితే .. ఒక్క హైదరాబాద్ లోనే 90 శాతం కేసులు నమోదవుతున్నాయి.  దాంతో  హైదరాబాద్ డేంజర్ జోన్ గా మారిందని జనం బెంబేలెత్తిపోతున్నారు. దీంతో హైదరాబాద్‌లో ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్ పెట్టే ఆలోచనలో ఉందన్న వార్తలతో ప్రజల్లో హైరానా మొదలైంది. మళ్లీ అన్నీ బంద్ అయితే ఇబ్బందిపడాల్సి వస్తుందన్న ఆందోళన పెరిగింది. దీంతో చిన్న ఉద్యోగులు, కూలీలు, చిన్న దుకాణాలు నడుపుకునే వాళ్లు సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. నగరంలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి‌. చాలా మంది సొంత, ప్రైవేట్ వాహనాల్లో ఊరిబాట పడ్డారు.

 

నగరంలో  మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారన్న వార్తలతో ప్రజలు సొంతూళ్లకు పయనమవ్వడంతో.. టోల్‌ ప్లాజాల దగ్గర  రద్దీ నెలకొంది. 15 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం వచ్చిన చిరు వ్యాపారుల, కార్మికుల బతుకులను చిద్రం చేసింది కరోనా. లాక్‌డౌన్‌ తరువాత కూడా ఉపాధి కరువవ్వడంతో సొంతూరి బాట పట్టారు. కుటుంబాలతో సహా స్వగ్రామాలకు తరలుతున్నారు. హైదరాబాద్‌కు ఇంక ఇప్పట్లో వచ్చేది లేదని చెప్తున్నారు.

 

లాక్‌డౌన్‌ తొలిదశలో బాగా ఇబ్బందిపడ్డ చిరుద్యోగులు.. మళ్లీ ఆ పరిస్థితి వస్తుందేమోనని భయపడుతున్నారు. ఉద్యోగాల్లేక, ఉన్నా జీతాలు సరిగా రాక, వచ్చిన డబ్బులు అవసరాలకు సరిపోక అవస్థలు పడ్డారు. ఇప్పుడిక చేసింది చాలనుకుంటూ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి ఊర్ల బాట పడుతున్నారు. అంతా బాగుంటే మళ్లీ తిరిగొద్దాం, లేకుంటే అక్కడే ఏదో రకంగా బతికేద్దామనే మొండితనంలో బస్సులు ఎక్కేస్తున్నారు.

 

అన్‌ లాక్‌ మొదలయ్యాక వివిధ రాష్ట్రాల నుంచి తిరిగొచ్చిన సుమారు లక్షన్నర మంది వలస కార్మికులు మళ్లీ టెన్షన్‌కు గురవుతున్నారు. కన్ స్ట్రక్షన్ తో పాటు వివిధ ఇండస్ట్రీల్లో పనిచేసే వీళ్లు ఇప్పుడెన్ని రోజులు లాక్‌డౌన్‌ ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇంతకుముందే తిండి, నీళ్లు లేక, డబ్బు దొరక్క అవస్థలు పడి.. వందలు, వేల కిలోమీటర్లు నడిచి సొంతూర్లకు వెళ్లారు. అన్‌లాక్‌ మొదలయ్యాక తిరిగొస్తే.. ఇప్పుడు మళ్లీ లాక్డౌన్ టెన్షన్‌ మొదలైంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: