కంత్రీ డ్రాగన్ కంట్రీకి షాకుల మీద షాకులిస్తోంది భారత్. చైనా కంపెనీలపై కీలక నిర్ణయం తీసుకుంది. రహదారి నిర్మాణ ప్రాజెక్టుల్లోకి ఆ దేశ కంపెనీలకు నో ఎంట్రీ చెప్పేసింది. 

 

భారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో చైనాను కట్టడి చేయడానికి సాధ్యమైన మార్గాలన్నింటిని భారత్ అన్వేషిస్తోంది. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తీసుకున్న నిర్ణయం కూడా ఈ కోవలోనిదే. జాయింట్‌ వెంచర్లతో సహా రహదారి నిర్మాణ ప్రాజెక్టుల్లో ఏ ఒక్క చైనా కంపెనీని అనుమతించమంటూ ఆయన స్పష్టం చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ- ఎమ్ ఎస్ ఎమ్ ఈల్లో చైనా పెట్టుబడిదారులు భాగస్వాములు కాకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇటీవల లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయ వద్ద ఇరు దేశాలకు చెందిన సైనికులు తీవ్ర స్థాయిలో ఘర్షణ పడటంతో  రెండు వైపులా ప్రాణనష్టం జరిగింది. భారత్‌కు చెందిన 21 మంది జవాన్లు మరణించారు. అప్పటి నుంచి సరిహద్దు వద్ద యుద్ధవాతావరణం నెలకొంది. భద్రతా కారణాలు చూపుతూ..చైనాకు చెందిన 59 యాప్స్‌ మీద భారత్ నిషేధం విధించింది. 

 

చైనా భాగస్వామ్యంతో ఉన్న జాయింట్ వెంచర్లకు రహదారి నిర్మాణంలో  పాలుపంచుకొనేందుకు అనుమతులు ఇవ్వబోమని, వారు జాయింట్ వెంచర్ల ద్వారా భారత్‌లోకి ప్రవేశించాలని చూసినా అనుమతులు ఇవ్వకుండా దృఢవైఖరిని చూపుతామని స్పష్టం చేసింది కేంద్రం. చైనా కంపెనీలపై నిషేధం విధిస్తూ, మన దేశ కంపెనీలు ఈ నిర్మాణంలో భాగస్వాములు అయ్యేలా నిబంధనల్లో సడలింపులు ఇస్తూ త్వరలో ఒక విధానాన్ని తీసుకురానుంది భారత్.   ప్రస్తుత, భవిష్యత్తు టెండర్లలో కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు నితిన్‌ గడ్కరీ.

 

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆత్మనిర్భర భారత్‌కు తాను ప్రధాన మద్దతుదారుడినని చెప్పుకొచ్చారు. చైనా నుంచి దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు, దేశాన్ని స్వావలంబన దిశగా నడిపేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. అలాగే ఓడరేవుల వద్ద వస్తువులను ఏకపక్షంగా నిలిపివేయడం లేదని స్పష్టం చేశారు. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నుంచి చెన్నై, విశాఖపట్నం ఓడరేవులకు చేరుకుంటున్న సరుకుల తనిఖీలను కస్టమ్స్‌ అధికారులు తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఆయన ఈ స్పష్టత ఇచ్చారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: