ఇటీవల మండలిలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. వైసీపీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీలు తన్నుకుని, మండలి పరువు తీసేశారు. అయితే ఆ రచ్చ సంగతి ఎలా ఉన్నా, అప్పుడు ద్రవ్యవినిమయ బిల్లు(బడ్జెట్‌కు సంబంధించిన బిల్లు) ఆమోదం పొందలేదు. ఫలితంగా ఒకటో తారీఖునా ఉద్యోగులకు జీతాలు అందలేదు. బిల్లు ఆమోదం పొందకపోవడానికి కారణం టీడీపీనే అని అందుకే జీతాలు ఇవ్వలేకపోయామని వైసీపీ మంత్రులు చెబుతున్నారు.

 

అయితే మంత్రులు అబద్దాలు చెబుతున్నారని, అసలు కథ వేరే ఉందని, మండలిలో బిల్లు ఆమోదం పొందకపోవడానికి మంత్రి బొత్స సత్యనారాయణ అసలు కారణమని టీడీపీ ఎమ్మెల్సీలు చెబుతున్నారు. బడ్జెట్ బిల్లు ప్రధానమైనది కాబట్టి, అది అసెంబ్లీ నుంచి వచ్చేదాక మిగతా బిల్లుల గురించి చర్చిద్దామని సమావేశాల ఆరంభంలో మండలి చైర్మన్ చెప్పారని, వైసీపీ తరఫున సుభాష్ చంద్రబోస్, టీడీపీ తరఫున యనమల రామకృష్ణుడు ఫ్లోర్ లీడర్ల హోదాలో ఆమోదించారని టీడీపీ ఎమ్మెల్సీలు వివరించారు.

 

ఇక సాయంత్రం 4 గంటలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ బిల్లు, ద్రవ్య బిల్లు అసెంబ్లీ నుంచి వచ్చాయని, దాంతో ఈ రెండు బిల్లులను ప్రవేశపెట్టాలని ఆర్థికమంత్రి బుగ్గనను మండలి చైర్మన్ కోరారని, బుగ్గన పైకి లేవగా, పక్కనే ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ ఆర్థికమంత్రిని తట్టి కూర్చోబెట్టారని గుర్తుచేశారు. కానీ దీనికంటే మూడు రాజధానులపై చర్చిద్దాం అంటూ బొత్స మండలి చైర్మన్ తో వితండవాదం చేశారని, ఇక అక్కడ నుంచే గొడవ జరిగిందని, దాంతో ఏ బిల్లు కూడా ఆమోదం పొందకుండా మండలి వాయిదా పడిందని టీడీపీ ఎమ్మెల్సీలు చెబుతున్నారు.

 

అప్పుడు అలా చేసి ఆ తప్పుని తమపై తోసేయాలనుకుంటున్నారని ఫైర్ అయ్యారు. అయితే మండలిలో ఏం జరిగిందో బయట ఉన్న ప్రజలకు ఏమి తెలియదు. కానీ ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం పొందకపోవడం వల్ల ఇప్పుడు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ఉద్యోగులు ఇబ్బందులు పడటానికి రెండు పార్టీలు కారణమవుతాయని విశ్లేషుకులు అంటున్నారు. పైగా దీంట్లో బాధ్యత ఎక్కువ అధికార పార్టీదే ఉంటుందని, కాబట్టి వారు ఎంత టీడీపీనే కారణమని చెబుదామనుకున్న, అన్నీ విషయాలు తెలిసిన ఉద్యోగులు ఆ మాటలని నమ్మరని అంటున్నారు. ఏదేమైనా ఈ విషయంలో వైసీపీ ప్లాన్ బెడిసికొట్టినట్లే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: