పేరుకి ఏపీ బీజేపీ...కానీ ఆ పార్టీలో మూడు వర్గాలు ఉంటాయి. ఒక వర్గం వారేమో టీడీపీకి మద్ధతు ఇస్తుంటే, మరొక వర్గం వైసీపీకి సపోర్ట్ ఉంటుంది. ఇక మూడో వర్గం బీజేపీ విధానాలకు కట్టుబడి ఉంటుంది. అయితే టీడీపీకి సపోర్ట్ చేసే వాళ్ళు...ఎప్పుడూ వైసీపీ ప్రభుత్వంపై, జగన్‌పై విమర్శలు చేస్తూ ఉంటారు. అసలు వారు కూడా టీడీపీ నేతల మాదిరిగానే నడుచుకుంటారు.

 

ఇక వైసీపీకి మద్ధతు ఇచ్చేవాళ్ళు, చంద్రబాబుని ఏకీపారేస్తుంటారు. బీజేపీ నుంచి టీడీపీ పొత్తు విడిపోయిన దగ్గర నుంచి వారు అదే పనిలో ఉన్నారు. అయితే రాయలసీమకు చెందిన యువ బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి...ఎవరికి ఎక్కువగా సపోర్ట్ గా ఉంటారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎప్పుడు జగన్‌కు అనుకూలంగానే ఉంటారని తెలుగు తమ్ముళ్ళు పలు సందర్భాల్లో విమర్శలు చేశారు.

 

ఇక మీడియా డిబేట్లలో కూడా ఆయన జగన్‌పై దూకుడుగా విమర్శలు చేయరు..కానీ చంద్రబాబుపై మాత్రం ఒంటికాలి మీద వెళుతుంటారు. అయితే ఈ మధ్య ఆయనలో కాస్త మార్పు వచ్చినట్లు కనబడుతుంది. వీలుని బట్టి చంద్రబాబుపై విమర్శలు చేస్తూనే ఉంటున్న విష్ణు...తాజాగా జగన్‌పై కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ మధ్య రాష్ట్రంలో బాగా హాట్ టాపిక్ అయిన 108, 104 వాహనాల కొనుగోలులో అవినీతి అంశంపై విష్ణు కూడా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడారు.

 

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి 108 వాహనాల్లో అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇక దీనిపై విష్ణు కూడా స్పందిస్తూ... అంబులెన్స్‌ల కొనుగోళ్లలో అవినీతి ఆరోపణలు నేపథ్యంలో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో డీ సెట్రలైజ్డ్ అవినీతి జరుగుతోందని, అధికారులపై దాడులు, భూ కబ్జాలు పెరుగుతున్నాయని విమర్శించారు.

 

పైగా 108,104 వాహనాలకు ఉన్న రంగుల విషయంలో కూడా విష్ణు విమర్శలు చేశారు. రంగులు వేయటంలో అంబులెన్స్‌లను కూడా వదలలేదని మండిపడ్డారు. అయితే వైసీపీకి అనుకూలంగా ఉండే విష్ణు...ఇలా రివర్స్ కావడంపై తెలుగు తమ్ముళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇలా రివర్స్ అవ్వడంలో కూడా ఏదో ప్లాన్ ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: