గ‌త కొద్దికాలంగా షాకుల ప‌రంప‌ర‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన అమెరికా నుంచి కీల‌క తీపిక‌బురు వినిపించింది. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చేలా... భార‌త్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పే వార్త‌ను ఆ దేశ ఎన్నిక‌లు తెర‌మీద‌కు తెచ్చాయి. ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో ఆ దేశ అధ్య‌క్ష‌ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల బ‌రిలో డెమోక్ర‌టిక్ పార్టీ అభ్య‌ర్థిగా జోసెఫ్ బైడెన్ పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే.  ఈ నేప‌థ్యంలో.. బైడెన్ ఓ వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ భార‌త్‌కు అనేక తీపిక‌బుర్లు తెలిపారు.

 

న‌వంబ‌ర్ ఎన్నిక‌లు చాలా కీల‌క‌మ‌ని, అది అమెరికా ఆత్మ కోసం జ‌రుగుతున్న పోరాట‌మ‌ని బైడెన్‌ అన్నారు. తాను అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో గెలిస్తే, భార‌త్‌తో బంధాన్ని బ‌లోపేతం చేసేందుకు అధిక ప్రాధాన్య‌త ఇస్తాన‌న్నారు. అమెరికాకు భార‌త్ స‌హ‌జ భాగ‌స్వామి అని, త‌మ ప్ర‌భుత్వం ఆ దేశానికి అత్యున్న‌త ప్రాధ‌న్యత క‌ల్పిస్తుందని బైడెన్ అ‌న్నారు. త‌మ భ‌ద్ర‌త, వారి భ‌ద్ర‌త‌ దృష్ట్యా .. భార‌త్‌తో బంధం కీల‌క‌మైంద‌న్నారు. భార‌త్‌తో భాగ‌స్వామ్యం, వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం కీల‌క‌మే కాదు, అత్యంత ముఖ్య‌మైంద‌ని కూడా బైడెన్‌ తెలిపారు.  ఒబామా పాల‌న‌లో అమెరికా  మాజీ ఉపాధ్య‌క్షుడిగా ఎనిమిదేళ్ల పాటు బైడెన్ బాధ్య‌త‌లు నిర్వర్తించారు. ద‌శాబ్ధం క్రితం ‌అమెరికా, భార‌త్ మ‌ధ్య పౌర అణు ఒప్పందం కుద‌ర్చ‌డంలో తాను పాత్ర పోషించిన‌ట్లు బైడెన్‌ తెలిపారు.తానెప్పుడూ ఇండియాకు పెద్ద మ‌ద్ద‌తుదారుడినే అని తెలిపారు. హెచ్‌1బీ వీసాల‌పై ఉన్న తాత్కాలిక నిషేధాన్ని కూడా ఎత్తివేస్తాన‌ని జోసెఫ్ బైడెన్ తెలిపారు. త‌ద్వారా ట్రంప్‌కు షాకు ఇచ్చారు బైడెన్‌.

 


ఇదిలాఉండ‌గా, డెమోక్ర‌టిక్ అధ్య‌క్ష అభ్య‌ర్థి రేసు కోసం బైడెన్ తొలుత.. ఐయోవా, న్యూ హాంప్‌షైర్ రాష్ట్రాల్లో ప్ర‌చారం నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత ద‌క్షిణ కరోలినాలో జ‌రిగిన స‌భ‌తో త‌న ప్ర‌చార వేగాన్ని పెంచారు. ఇక క్ర‌మంగా సూప‌ర్ ట్యూజ్‌డే చ‌ర్చ‌ల్లో బైడెన్ డామినేట్ చేశారు. 14 కాంటెస్ట్‌ల‌లో ఆయ‌న ప‌ది గెలుచుకున్నారు. 77 ఏళ్ల బైడెన్ అమెరికా అధ్య‌క్ష స్థానానికి పోటీ ప‌డ‌డం ఇది మూడ‌వ సారి. దేశాధ్య‌క్షుడికి కావాల్సిన అన్ని అర్హ‌త‌లు బైడెన్‌కు ఉన్న‌ట్లు ఒబామా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: