జగన్ పేరు చెప్పినా, వైసీపీ పేరు చెప్పినా ఆ రెండు పత్రికలకు అస్సలు గిట్టదు. ఎప్పడూ  ఆ రెండు పత్రికల్లో జగన్ , వైసీపీ లకు సంబంధించి వ్యతిరేక కథనాలు వస్తూనే  ఉంటాయి. ప్రభుత్వ తీరును ఎండగడుతూ అనేక కథనాలు ప్రచురితం అవుతూ ఉంటాయి. ఇదేమి కొత్త కాదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రెండు పత్రికలు అంటూ ఆయన పదే పదే ప్రస్తావిస్తూ, పెద్ద ఎత్తున విమర్శలు చేసేవారు. ఇంతకీ ఆ రెండు పత్రికలు అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు. టీడీపీకి అనుకూలంగా, వైసీపీకి వ్యతిరేకంగా  కథనాలు ఈ రెండు పత్రికల్లో రావడం సాధారణ విషయమే అన్నట్టుగా అప్పటి పరిస్థితి ఉంది. ఇప్పడు జగన్ విషయంలోనూ అదే పరిస్థితి ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు ప్రకటనలు ఇచ్చేవారు కాదు.

 

ఈ  వ్యవహారంపై ఆంధ్రజ్యోతి కోర్టుకు వెళ్లి మరీ ప్రకటనలు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత ఏ ప్రభుత్వంతోనూ ఆ రెండు పత్రికలకు పెద్దగా ఇబ్బంది ఏర్పడలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాధారణంగానే ఆ రెండు పత్రికలు అంటూ వీటిని పక్కన పెట్టి ప్రకటనలు నిలిపివేశారు. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, దినపత్రిక ఈ తరహా ఇబ్బందులను ఏపీ తెలంగాణలోనూ ఎదుర్కొంది. తెలంగాణలో కేసీఆర్ సుమారు రెండు సంవత్సరాల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్నారు.. ఇవన్నీ పక్కన పెడితే, తాజాగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో జగన్ ఫోటో తో ఒక ఫుల్ పేజీ ప్రకటన రావడం అందరినీ ఆశ్చర్యానికి  గురి చేసింది. ఆంధ్రజ్యోతిలో జగన్ ఫోటో తో ప్రకటన రావడం ఏంటి ? అని అందరు షాక్ అయ్యారు. దీని గురించి పూర్తిగా ఆరా తీస్తే కానీ అసలు విషయం ఏంటో తెలియలేదు.

 

ఏపీ నాట్కో క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా, ఆ కార్యక్రమానికి హాజరవుతున్న జగన్ కు స్వాగతం చెబుతూ, ఆంధ్రజ్యోతి పత్రిక లో మొదటి పేజీలో జగన్ ఫోటో తో కూడిన ప్రకటనను విడుదల చేశారు. ఇంతకీ విషయం ఏంటంటే.. అది ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన కాదు. నాట్కో సంస్థ ఇచ్చింది. అంటే ఇది ఓ ప్రైవేటు ప్రకటన. ఇంతకీ ఈ నాట్కో సెంటర్ నన్నపనేని చౌదరి గారిది. ఈ క్యాన్సర్ సెంటర్ ను జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తుండడంతో  ఇలా ఆంధ్రజ్యోతిలో జగన్ కు సంబంధించి ఫుల్ పేజీ ప్రకటన విడుదలైంది. ప్రభుత్వం తరపు నుంచి ఇటువంటి, ఇంత భారీ ప్రకటనలు ఎప్పుడు వస్తాయో అని, ఎప్పటి నుంచో ఆంధ్రజ్యోతి ఆశగా ఎదురుచూస్తోంది. అసలే ఇప్పుడు దిన పత్రికలు ఏటికి ఎదురు ఈదుతున్న సమయం. దీనికి తోడు కరోనా కాలం కూడా కావడంతో, మరింతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: