చైనా దేశానికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఎన్ని దురాగతాలు చేస్తున్నా చైనా తమ దేశం గురించి గొప్పలు చెప్పుకోవడం మాత్రం మానదు. గుట్టుచప్పుడు కాకుండా దారుణాలకు పాల్పడే డ్రాగన్ పైకి మాత్రం అద్భుతంగా మాట్లాడగలదు. భారత్ తోనే కాకుండా ఇతర దేశాలతో కూడా అక్రమంగా భూములను ఆక్రమిస్తూ వివాదాలను సృష్టించుకుంటున్న చైనా పైకి మాత్రం నీతులు చెబుతుంది. భారత్ విషయంలో వివక్షతో వ్యవహరించడం లేదని తాజాగా చైనా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 
 
జూన్ నెల 15వ తేదీన చైనా భారత్ దేశాల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో భారత్ జవాన్లు 20 మంది వీరమరణం పొందారు. ఈ ఘటన అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో చైనా విషయంలో కఠినంగా వ్యవహరించాలని భారత్ టిక్ టాక్ సహా 59 చైనీస్ యాప్ లపై నిషేధం విధించింది. దీంతో చైనాకు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది. ఆర్థికంగా దెబ్బ తిన్న చైనా ఇప్పుడు సుద్దులు చెప్పడం ప్రారంభించింది. 
 
చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా భారత్ తమ యాప్ లపై నిషేధం విధించినా భారత్ ఉత్పత్తులు, సేవల పట్ల ఎటువంటి వివక్ష ప్రదర్శించడం లేదని పేర్కొంది. గతంలో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలని పేర్కొంది. చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ పత్రికలో ఈ మేరకు కథనం ప్రచురితమైంది. చైనా దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గావో ఫెంగ్ మాట్లాడుతూ తాము భారత్ ఉత్పత్తులు, సేవల పట్ల ఎటువంటి వివక్ష ప్రదర్శించటం లేదని అన్నారు. 
 
ఇరు దేశాల ప్రభుత్వాలు, సంస్థలు చేసిన సమిష్టి కృషి వల్లే దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సహకారం వృద్ధి చెంది సక్సెస్ కావడానికి కారణమైందని తెలిపారు. ఒక దేశానికి మరో దేశం సహకారం అందించుకుంటే ఇరు దేశాల ప్రజల ఉమ్మడి మౌలిక వసతులకు దోహదపడుతుందని చెప్పారు. అయితే చైనా తాజా కామెంట్లపై భారత్ నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనా చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతనే ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: