భారత్ చైనా దేశాల మధ్య వివాదం అంతకంతకూ ముదురుతోంది. మరోవైపు చైనాకు వరుస షాకులు తగులుతున్నాయి. భారత్ చైనా విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే చైనాకు సంబంధించిన 59 యాప్ లపై భారత్ నిషేధం విధించింది. భారత్ హైవే ప్రాజెక్టుల నిర్మాణాల్లోను చైనా కంపెనీలకు అనుమతి లేదని భారత్ స్పష్టం చేసింది. ఇదే సమయంలో చైనాకు ఇతర దేశాలు సైతం షాక్ ఇస్తున్నాయి. 
 
అలా షాక్ ఇస్తున్న దేశాలలో చైనా సన్నిహిత దేశాలు సైతం ఉండటం గమనార్హం. తాజాగా మయన్మార్ చైనాకు భారీ షాక్ ఇచ్చింది. డ్రాగన్ పై గతంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయని మయన్మార్ ఇప్పుడు చైనా నుంచి రక్షించుకోవడానికి అంతర్జాతీయ సహకారాన్ని కోరుతోంది. మయన్మార్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ లాయింగ్ మాట్లాడుతూ చైనా ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలు సరఫరా చేస్తోందని విమర్శలు చేశారు. 
 
తిరుగుబాటు గ్రూపులను అణచివేయటం కోసం అంతర్జాతీయ సహకారం కావాలని వ్యాఖ్యలు చేశారు. మయన్మార్ లోని ఉగ్రవాద సంస్థలకు బలమైన శక్తుల మద్దతు ఉందని పేర్కొన్నారు. మిన్ వింగ్ వ్యాఖ్యలపై ఆ దేశ మిలిటరీ ప్రతినిధి జా మిన్ తున్ మాట్లాడుతూ ఆరాకన్ ఆర్మీ, ఆరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీలను ఉద్దేశించి ఆర్మీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. చైనా సరిహద్దులో ఉన్న రాఖైన్ రాష్ట్రంలో ఆ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలుస్తోంది. 
 
ఆ సంస్థల దగ్గర చైనాలో తయారైన ఆయుధాలు ఉన్నాయని గుర్తించినట్లు మయన్మార్ చెబుతోంది. ఆ ఆయుధాలలో 70 వేల నుంచి 90 వేల డాలర్ల క్షిపణులు కూడా ఉన్నాయని సమాచారం. లభ్యమైన ఆయుధాలలో మెజారిటీ భాగం చైనాకు చెందిన ఆయుధాలేనని మయన్మార్ చెబుతోంది. చైనాతో ఇప్పటివరకు సన్నిహితంగా మెలిగిన దేశాలే ప్రస్తుతం ఆ దేశానికి షాకులు ఇస్తూ ఉండటం గమనార్హం.    

మరింత సమాచారం తెలుసుకోండి: