ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి చిగురుటాకులా వణికిస్తోంది. బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. గతంలో వృద్ధులే ఎక్కువగా కరోనా భారీన పడతారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా యువత కూడా ఎక్కువ సంఖ్యలో కరోనా భారీన పడుతున్నట్టు తేలింది. యువత వైరస్ ను తేలికగా తీసుకోవద్దంటూ వైద్య, ఆరోగ్య రంగ నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. 
 
ప్రపంచవ్యాప్తంగా యువతే ఎక్కువ సంఖ్యలో వైరస్ భారీన పడుతున్నారని వాళ్లు చెబుతున్నారు. యువతలో కేసుల సంఖ్య పెరిగితే వాళ్ల ద్వారా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని వాళ్లు చెబుతున్నారు. నమోదవుతున్న కేసుల్లో సగం కేసులు 20 - 44 ఏళ్ల మధ్యలో ఉన్నవాళ్లే అని సమాచారం. నిపుణులు యువతలో చాలామంది భౌతిక దూరం పాటించడం లేదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. పలు దేశాల్లో వైరస్ భారీన పడిన యువత ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ప్రభుత్వాలు, అధికారులు చర్యలు చేపట్టకపోతే యువతలో కేసులు అనూహ్యంగా పెరిగే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. మరోవైపు అన్ లాక్ 1.0 తర్వాత భారత్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మన దేశంలో 45 ఏళ్ల లోపు వాళ్లే ఎక్కువగా వైరస్ భారీన పడుతున్నారు. 
 
భారత్ లో నిబంధనలు సడలించిన తరువాత ఉపాధి కోసం యువత బయటకు వస్తోంది. షుగర్, బీపీ, హృదయ సంబంధిత వ్యాధులతో బాధ పడే యువత ఎక్కువగా కరోనా భారీన పడుతున్నారు. యువతలో లక్షణాలు కనిపించకపోవటం వల్ల వీరి నుంచి వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. నిపుణులు యువత నిబంధనలను పాటించాలని తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే వైరస్ భారీన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు.      

మరింత సమాచారం తెలుసుకోండి: