కాపులను బీసీల్లో చేర్చాలని గత టీడీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన ముద్రగడ పద్మనాభం వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీ సీఎం జగన్ కు తాజాగా ముద్రగడ పద్మనాభం లేఖ రాస్తూ, అందులో అనేక అంశాలను ప్రస్తావించారు. ఆ లేఖలో జగన్ సున్నితంగానే హెచ్చరిస్తూ ముద్రగడ మొహమాట పడుతూ లేఖ రాసినట్లు కనిపిస్తోంది. అడిగిన వారికి, అడగని వారికి అందరికీ దానాలు చేసి దానకర్ణుడు అనిపించుకుంటున్న సీఎం జగన్ కాపు రిజర్వేషన్ల సాధించే విషయంలో ఎందుకు చేతులు రావడం లేదని ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడానికి కాపు జాతి మద్దతు చాలా ఉందనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. 
 
 
 
కాపు రిజర్వేషన్ అంశం సరైనదేనని గతంలో జగన్ చెప్పారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా దివంగత రాజశేఖర్ రెడ్డిని ముద్రగడ గుర్తు చేశారు. రాజశేఖర్రెడ్డి తరహాలోనే జగన్ కూడా ప్రజలతో పూజలు అందుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పదవిని మూన్నాళ్ళ ముచ్చటగా చేసుకోవద్దు అంటూ జగన్ కు హెచ్చరికలు కూడా చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పటివరకు ఈ వ్యవహారంలో నోరు మెదపకుండా ఉన్న ముద్రగడ ఒక్కసారిగా ఇలా లేఖ పేరు తో విరుచుకుపడడం చూస్తుంటే .. చాలా విషయాలే బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం కాపు నేస్తం పేరుతో వైసీపీ ప్రభుత్వం అర్హులైన కాపు మహిళల బ్యాంకు అకౌంట్లలో నేరుగా సొమ్ములు జమ చేయడంతో, కాపు ఓటు బ్యాంకు మొత్తం ఆ పార్టీకి వెళ్ళిపోతుందనే ఆందోళనలో జనసేన అధినేత పవన్, రిజర్వేషన్ అంశాన్ని తెరమీదకు తెచ్చి, వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 
 
 
 
కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో జగన్ కు మనసు రావడం లేదని, ఎన్నో ఆరోపణలు చేశారు. దీనిపై వైసీపీ జనసేన మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముద్రగడ వ్యవహారం కూడా తెర మీదకు వచ్చింది. ఏపీ లో ఇంత రాద్దాంతం జరుగుతు న్నా, ఆయన నోరు మెదపకపోవడం పై అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో మొత్తం ఈ వ్యవహారంలో తాను బలి అవుతున్నాననే విషయాన్ని గ్రహించిన ముద్రగడ ఇప్పుడు ఈ రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్ కు లేఖ రాసినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పవన్ కు క్రెడిట్ రాకుండా, తన పరపతి పోకుండా ముద్రగడ ఈ విషయం ఇలా స్పందించినట్లు గా అర్థం అవుతోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: